ఆసియా క్రీడలు 2023 : 10 వేల మీటర్ల రేసులో భారత్‌కు డబుల్ బొనాంజా .. 38కి చేరిన ఇండియా పతకాలు
ఆసియా క్రీడలు 2023లో పురుషుల 10,000 మీటర్ల రేసు ఫైనల్‌లో భారత్ సత్తా చాటింది. మనదేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు కార్తీక్ కుమార్, గుల్వీర్ సింగ్ వరుసగా 2వ , 3వ స్థానాల్లో నిలిచి రజతం, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.

ఆసియా క్రీడలు 2023లో పురుషుల 10,000 మీటర్ల రేసు ఫైనల్‌లో భారత్ సత్తా చాటింది. మనదేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు కార్తీక్ కుమార్, గుల్వీర్ సింగ్ వరుసగా 2వ , 3వ స్థానాల్లో నిలిచి రజతం, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 38కి చేరుకుంది. అలాగే పటిష్టమైన ముగింపు కోసం ఇండియా ఎదురు చూస్తోంది. భారత్ సాధించిన మొత్తం పతకాల్లో పది బంగారు, 14 రజతం, 14 కాంస్య పతకాలున్నాయి.
ఇకపోతే.. ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద అనుభవం లేనప్పటికీ పతకాలను ఒడిసి పడుతున్నారు. భారత షూటర్లు 18 పతకాలను సొంతం చేసుకోగా.. ఇందులో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలు వున్నాయి. ఇషా సింగ్, పాలక్, మనుబాకర్, రమిత జిందాల్, రుద్రాంక్ష్ పటేల్‌లు పతకాల జోరు కొనసాగిస్తున్నారు.
ఇదిలావుండగా భారత పురుషుల టీమ్ స్క్వాష్ విభాగం ఫైనల్‌లో మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 2-1 తేడాతో గెలిచిన భారత్ స్వర్ణ పతకాన్ని అందుకుంది. అలాగే టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జోడి రోహన్ బోపన్న- రుతుజ భోస్లే బంగారు పతకాన్ని అందుకున్నారు. ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన సంగ్-లియాంగ్ జోడిని 2-6, 6-3, 10-4 తేడాతో ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది.