లేటెస్ట్‌గా వచ్చా.. లెజెండ్ అనొద్దు : మో సలా

It is my World Cup debut, Dont call me legend: Mo Salah
Highlights

లేటెస్ట్‌గా వచ్చా.. లెజెండ్ అనొద్దు : మో సలా

హైదరాబాద్: ఈజిప్ట్ టీమ్‌కు తురుపు ముక్క మహమ్మద్ సలా. మో సలా పేరుతో పాపులర్ అయిన ఈ స్టార్ ప్లేయర్ వల్లే ఈజిప్ట్ దాదాపు 28 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వరల్డ్ కప్ బరిలోకి దిగే చాన్స్ దక్కించుకుందంటే అతిశయోక్తి కాదు. లివర్‌పూల్ కోసం 44 గోల్స్ చేయడం ద్వారా యావత్ ప్రపంచంలో ఫుట్‌బాల్ ప్లేయర్స్, ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాడు.
 రొనాల్డో, మెస్సీ లాంటి లెజెండ్స్ సరసన చోటు దక్కించుకున్నాడు. మరికొద్ది గంటల్లో మాస్కోలో మెగా ఈవెంట్ మొదలవుతుందనగా, వరల్డ్ కప్‌లో తొలిసారిగా పాల్గొంటున్న  ఉద్విగ్నభరిత సమయంలోనూ మో సలా తన క్రీడా ప్రస్థానం విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.

''అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ కప్‌లో నేనూ ఆడుతున్నానంటే నమ్మలేకపోతున్నాను. అంతా కలగా ఉంది. 1990 తర్వాత మేం(ఈజిప్ట్) వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్నాం. తుది దాకా పోరాడాలనే గట్టి సంకల్పంతో ఉన్నాం" అని ఉత్సాహంగా అన్నాడు.

ఛాంపియన్స్ లీగ్ ఫైనల్, ఈజిప్ట్ వరల్డ్ కప్ మిస్ అవుతుందనే వార్తలపై స్పందిస్తూ '' నేను గాయపడ్డం, టైటిల్ దక్కించుకోలేకపోవడం అత్యంత దురదృష్టకరమైన పరిణామం. అదలా జరిగిపోయింది. అయితే ఇప్పుడిలా నేను వరల్డ్ కప్ ఆడటానికి రష్యాలో ఉండటం చిన్న విషయమేమీ కాదు కదా..! దానికన్నా ఇది చాలా ఇంపార్టెంట్. మా టీమ్ క్వాలిఫ్ అయిన తర్వాత నేను ఇక్కడ దాకా రాలేకపోయినట్టయితే దానంత దురదృష్టకరమైనది నా దృష్టిలో మరొకటి ఉండదు. భగవంతుడు వరల్డ్ కప్‌లో భాగమయ్యే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. నా కల నిజం చేసుకుంటాను'' అని స్పష్టం చేశాడు. 

గ్రూప్‌లో రష్యా, సౌదీ అరేబియా, ఉరుగ్వే టీమ్స్ ఉన్నప్పటికీ నాకౌట్‌కు క్వాలిఫై కావడం గురించి పెద్దగా ఆలోచించకుండా, అంతకన్నా పై లెవల్‌లో బాగా ఆడ్డం మీదనే తమ టీమ్ దృష్టి పెడుతుందని మో సలా అన్నాడు. బాగా ప్రిపేర్ అయ్యాం. ఆ మూడు మ్యాచ్‌లలో బ్రహ్మాండంగా రాణిస్తామని ధీమాగా చెప్పాడు. కానీ అదే సమయంలో ఆటను ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యమని అన్నాడు.

రెండు సార్లు వరల్డ్ కప్ దక్కించుకొని, 2010లో సెమీ ఫైనల్స్ దాకా వచ్చిన ఉరుగ్వేతో తొలి మ్యాచ్ ఆడటం గురించి మాట్లాడుతూ ''ఆ టీమ్‌లో లూయిస్ సురేజ్, ఎడిన్‌సన్ కవనీ లాంటి గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు. టైట్ గేమ్ ఆడ్డం అంటే వాళ్ళకు ఇష్టం. ప్రత్యర్థుల కాలు కదపనివ్వకుండా కట్టడి చేయడంలో ముందుంటారు. నిజంగా మాకిది టఫ్ గేమ్. అయినా అందుకు ప్రిపేర్ అయ్యే వచ్చాం. మేమే కనుక స్కోర్ చేయగలిగితే.. మా డిఫెన్స్ బ్రేక్ చేయడం వాళ్ళకు చాలా కష్టమైపోతుంది'' అని విశ్లేషించాడు.

ఫుట్‌బాల్ క్రీడా విశ్లేషకులు, అభిమానులు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డో లాంటి లెజెండ్‌లతో తనను పోల్చడంపై స్పందిస్తూ అంతర్జాతీయంగా సాధించిన విజయాలు, స్టార్‌డమ్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వారి స్థాయికి తానింకా చేరుకోలేదని వినమ్రంగా చెప్పాడు. దేవుడి దయ వల్ల ప్రొఫెషనల్ యూరోపియన్ ఫుట్‌బాల్‌తో తన క్రీడా ప్రస్థానాన్ని మొదలు పెట్టానని మో సలా తెలిపాడు. తొలిసారిగా వరల్డ్ కప్ మైదానంలోకి అడుగుపెట్టిన తనను స్టార్స్‌గా ఇప్పటికే సెటిలైపోయిన వారి సరసన చేర్చవద్దని రిక్వెస్ట్ చేశాడు.

loader