చెన్నై సూపర్ కింగ్స్ కి.. ఐపీఎల్ ట్రోఫీ... చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది. ఇప్పటికి మూడుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై.. నాలుగోసారి కూడా తమకే దక్కుతుందని భావించింది. కానీ ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో విజయం ముంబయిని వరించింది. 

కేవలం ఒక్క పరుగు తేడాతో చెన్నై ట్రోఫీ చేజార్చుకుంది. కాగా... దీనిపై మ్యాచ్ అనంతరం ధోనీ  చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కాగా మ్యాచ్‌ గురించి ధోనీ వ్యాఖ్యానిస్తూ.. ఇది ఫన్నీ ఫైనల్‌ మ్యాచ్‌ అని, మ్యాచ్‌ ఆసాంతం ఇరుజట్లు పరస్పరం ట్రోఫీని ఇచ్చిపుచ్చుకున్నాయని పేర్కొన్నారు.

‘ఇది చాలా ఫన్నీ గేమ్‌. మ్యాచ్‌ ఆసాంతం మేం పరస్పరం ట్రోఫీని చేతులు మార్చుకుంటూ వచ్చాం. ఇరు జట్టు తప్పిదాలు చేశాయి. ఒక తప్పిదం తక్కువ చేయడం వల్ల ప్రత్యర్థి జట్టు విజేతగా అవతరించింది’ అని ధోనీ పేర్కొన్నాడు. బౌలర్లు అద్భుతంగా రాణించి ముంబైని 150 కన్నా తక్కువ స్కోరుకు కట్టడి చేశారని, కానీ, బ్యాటింగ్‌లో తాము అనుకున్నమేరకు రాణించకపోవడంతో పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం తమ దృష్టి అంతా కేవలం వరల్డ్ కప్ మీదేనని ధోనీ తెలిపారు.