టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బీసీసీఐ మాజీ సెలక్టర్ సంజయ్ జగ్దాలే ప్రశంసలు కురిపించారు. ధోనీ ఎప్పుడూ దేశం కోసమే ఆడాడనని... అలాంటి ఆటగాడికి ప్రత్యామ్నాయం ఎవరూ ఉండరని అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా ధోనీ రిటైర్మెంట్ తీసుకోనున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంపై సంజయ్ జగ్దాలే స్పందించాడు.

ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో ధోనీకి బాగా తెలుసని ఆయన అన్నారు. సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ విషయంలో సెలక్టర్లు ఎలా అయితే వ్యవహరించారో... ధోనీ విషయంలోనూ అంతే వ్యవహరించాలని సూచించారు. రిటైర్మెంట్ విషయంపై సెలక్టర్లు ముందు ధోనీతో మాట్లాడి తెలుసుకోవాలని హితవు పలికారు. 

ధోనికి ప్రస్తుతం 38 సంవత్సరాలని... ఈ వయసులో అతను మునుపటిలా ఆడాలని కోరుకోవడం కరెక్ట్ కాదని చెప్పారు. తమ కెరీర్ లో సరిగా ఆడని వాళ్లు కూడా ధోనీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నిజమైన ఆటగాళ్లకే ధోనీ విలువ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువ క్రికెటర్ రిషభ్ పంత్ ని ముందే జట్టులో ఆడించాల్సిందని అభిప్రాయపడ్డారు. అప్పుడు పంత్.. ధోనీ ఆటను  చూసి నేర్చుకునే అవకాశం ఉండేదని చెప్పారు.