ప్రపంచ కప్ ఫైనల్‌లో భారతీయ ఆర్చరీ ఆటగాడు ప్రథమేశ్ జావ్‌కర్‌ రజతం సాధించాడు.

ప్రపంచ కప్ ఫైనల్‌లో భారతీయ ఆర్చరీ ఆటగాడు ప్రథమేశ్ జావ్‌కర్‌ రజతం సాధించాడు. ప్రథమేశ్ జావ్‌కర్‌ తన తొలి ‘‘వరల్డ్ కప్ ఫైనల్’’లో డెన్మార్క్‌కు చెందిన మథియాస్ ఫుల్లెర్టన్‌తో తీవ్రమైన షూట్-ఆఫ్ ముగింపులో అతి తక్కువ తేడాతో ఓడిపోయాడు. దీంతో అతడు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫుల్లెర్టన్ చేతిలో 148-148 (10-10*) తేడాతో ప్రథమేశ్ జావ్‌కర్ ఓడిపోయాడు. ఫుల్లెర్టన్ బాణం సెంటర్‌కు దగ్గరగా ఉండటం ద్వారా విజేతగా గుర్తించబడ్డాడు.

ఇక, ఫైనల్ పోరులో ప్రథమేశ్ జావ్‌కర్ ఓపెనింగ్ రౌండ్‌లో ఒక పాయింట్ కోల్పోవడంతో ఫుల్లెర్టన్ ఆరంభంలో ఆధిక్యాన్ని సంపాదించాడు. ఇక, మిడ్‌వే మార్క్‌లో 89-90తో ప్రథమేశ్ వెనుకబడ్డాడు. ఫైనల్‌ను 30 పాయింట్లలో 30 పాయింట్లు సాధించి.. 119తో ఆఖరి రౌండ్‌లోకి వెళ్లే సమయంలో రేస్‌లోకి వచ్చారు. అయితే నిర్ణీత చివరి ఎండ్‌లో.. ఇద్దరూ 29 చొప్పున ఒకే స్కోర్‌లు చేసి షూటాఫ్‌కు తీసుకెళ్లారు. టైబ్రేకర్‌లో కూడా భారత ఆటగాడు ప్రథమేశ్ జావ్‌కర్ బాణాన్ని అతి తక్కువ మార్జిన్ల తేడాతో మిస్ చేశాడు. .

ఇదిలా ఉంటే, సెమీఫైనల్‌లో 150 పాయింట్లలో 150 సాధించి.. ప్రపంచ నంబర్ 1, ప్రస్తుత ఛాంపియన్ డచ్‌కు చెందిన మైక్ ష్లోసెర్‌ను ప్రథమేశ్ జావ్‌కర్ ఓడించాడు. నాలుగు నెలల్లో అతడిని ఓడించడం ఇది రెండో సారి. ఇటీవల మేలో జరిగిన షాంఘై ప్రపంచకప్ ఫైనల్‌లో ప్రథమేశ్ 149-148తో విజయం సాధించాడు.

ఇక, క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన సాయర్ సుల్లివాన్‌ను 146-146 (10-9)తో ఓడించి మూడో ప్లేస్‌కు చేరుకున్న మరో భారత ఆటగాడు అభిషేక్ వర్మ రెండో ప్రపంచ కప్ ఫైనల్ కాంస్యంపై దృష్టి సారించాడు. సెమీఫైనల్‌లో వర్మ 147-150తో ఫైనల్ ఛాంపియన్ ఫుల్లర్టన్ చేతిలో ఓడిపోయాడు. మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో అదితి స్వామి, జ్యోతి సురేఖ వెన్నం ద్వయం తమ ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లలో ఓడిపోవడంతో భారత్‌కు నిరాశే మిగిలింది.