రికార్డుల రారాజు, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న కోహ్లీ.. తాజాగా... వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మను దాటేశాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం టీం ఇండియా దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా... మొదటి టీ20 వర్షం  కారణంగా రద్దు కాగా... రెండో టీ 20లో టీం ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 52బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు చేసి 72 పరుగులతో జట్టు విజయానికి సహాయపడ్డాడు. ఈ క్రమంలో కోహ్లీ కొత్త రికార్డులను తన జాబితాలో వేసుకున్నాడు. 

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లీ తొలి స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 2,441 పరుగులతో టాప్ కి చేరుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మను కూడా దాటేశాడు. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 2,434  పరుగులు సాధిస్తే, దాన్ని  తాజాగా కోహ్లి బ్రేక్‌ చేశాడు. ఈ వరుసలో మార్టిన్‌ గప్టిల్‌( 2,283-న్యూజిలాండ్‌) మూడో స్థానంలో ఉండగా, షోయబ్‌ మాలిక్‌(2,263-పాకిస్తాన్‌) నాల్గో స్థానంలో ఉన్నాడు. బ్రెండన్‌ మెకల్లమ్‌(2,140-న్యూజిలాండ్‌) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

అంతర్జాతీయ టీ20 హాఫ్‌ సెంచరీల్లో సైతం రోహిత్‌ను అధిగమించాడు కోహ్లి.  ఇప్పటివరకూ రోహిత్‌ శర్మ 21 అర్థ శతకాలు సాధిస్తే, కోహ్లి దాన్ని సవరించాడు. కోహ్లి 22 అంతర్జాతీయ హాఫ్‌ సెంచరీలతో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో తర్వాత స్థానాల్లో వరుసగా మార్టిన్‌ గప్టిల్‌(16), బ్రెండన్‌ మెకల్లమ్‌(15), క్రిస్‌ గేల్‌(15)లు ఉన్నారు.