Asianet News TeluguAsianet News Telugu

భారత్ కు కళ్లెం: వన్డే సిరీస్ ఇంగ్లాండు కైవసం

వన్డే సిరీస్ లో నిర్ణాయత్మకమైన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, ధోనీ, శిఖర్ ధావన్ నిలదొక్కుకోవడం వల్ల భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. 

India finish at 256 in series-decider

లీడ్స్: వన్డేల్లో భారత్ జైత్రయాత్రకు ఇంగ్లాండు కళ్లెం వేసింది. చివరిదైన మూడో వన్డేల్లో భారత్ అన్ని విభాగాల్లోనూ విఫలమై ఓటమిని చవి చూసింది. ఇంగ్లాండు భారత్ తన ముందు ఉంచిన 257 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. 

జో రూట్‌ (120 బంతుల్లో 10 ఫోర్లతో 100 నాటౌట్‌), ఇయాన్‌ మోర్గాన్‌ (108 బంతుల్లో 9ఫోర్లు, సిక్స్‌తో 88 నాటౌట్‌) రెచ్చిపోయి ఆడడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. 1997 తర్వాత మూడు వన్డేల సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి. 

ఇంగ్లండ్‌ 44.3 ఓవర్లలో 2 వికెట్లకు 260 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రషీద్‌కు, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ రూట్‌కి దక్కాయి. ఇంగ్లండ్‌కు ఇది వరుసగా 8వ సిరీస్‌ విజయం.

వన్డే సిరీస్ లో నిర్ణాయత్మకమైన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, ధోనీ, శిఖర్ ధావన్ నిలదొక్కుకోవడం వల్ల భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. 

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత్  బ్యాటింగ్‌కు దిగింది. అయితే భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విల్లీ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ(2) క్యాచ్ ఔట్ అయ్యాడు. 

ఈ దశలో విరాట్, ధావన్‌లు కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే 18వ ఓవర్‌ నాలుగో బంతికి పరుగు కోసం తొందరపడి ధావన్(44) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ వేగం పెంచాడు. దూకుడుగా ఆడి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే దినేశ్ కార్తీక్(21) అదిల్ రషీద్ వేసిన 25వ ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఆ తర్వాత ధోనీతో కలిసి నిలకడగా ఆడుతున్న కోహ్లీ రషీద్ వేసిన 31వ ఓవర్ తొలి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి రైనా(1) స్లిప్‌లో ఉన్న రూట్‌కి క్యాచ్  ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. 

ఆ తర్వాత ధోనీ నిలకడగా ఆడది 42 పరుగులు చేశాడు. హార్దీక్ పాండ్యా (21 పరుగులు), భువనేశ్వర్ కుమార్ (21), ఠాకూర్ (22) చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోరు సాధించగలిగింది. ఇంగ్లాండు బౌలర్లలో విల్లీ, రషీద్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, వుడ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios