Asianet News TeluguAsianet News Telugu

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం.. స్పెయిన్ పై ఘన విజయం

Hockey World Cup 2023: ఒడిషా ఆతిథ్యమిస్తున్న హాకీలో  తొలి రోజు భారత్ అదరగొట్టింది.   ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్న భారత జట్టు ఆ దిశగా తొలి అడుగు ఘనంగా వేసింది. 
 

India Beats Spain in Hockey World Cup Opening Match
Author
First Published Jan 14, 2023, 11:19 AM IST

హాకీ ప్రపంచకప్ లో తొలి అడుగును భారత్ ఘనంగా వేసింది.  ఒడిషా వేదికగా  జరుగుతున్న హాకీ ప్రపంచకప్  - 2023 టోర్నీలో స్పెయిన్ తో ఆడిన తొలి మ్యాచ్ లో 2-0 తేడాతో  ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఆది నుంచీ  బంతిని అదుపులో ఉంచుకుని  స్పెయిన్ పై ఎదురుదాడికి దిగిన హర్మన్‌ప్రీత్  సేన.. చివరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకుంది.  ప్రత్యర్థికి గోల్ కొట్టే అవకాశం లేకుండా   భారత్ గోల్ కీపర్  క్రిషన్ పాథక్   అడ్డుగోడలా నిలిచాడు.  

భువనేశ్వర్ లో జరిగిన మ్యాచ్  ప్రారంభమైన వెంటనే భారత్ కు పెనాల్టీ కార్నర్ లభించింది. 11వ నిమిషంలో వచ్చిన ఆ అవకాశాన్ని జర్మన్‌ప్రీత్ వదిలేశాడు. అయితే  ఆ తర్వాత నిమిషంలోనే  భారత్ కు  మరో పెనాల్టీ కార్నర్ కు  ఛాన్స్ దక్కింది.  కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫ్లిక్ చేసిన బంతిని   స్పెయిన్ ఆటగాళ్లు అడ్డుకోవడంతో వెనక్కి వచ్చింది.  కానీ అక్కడే ఉన్న అమిత్ క్షణాల్లో స్పందించి అదిరిపోయే షాట్ తో తిరిగి బంతిని గోల్ పోస్ట్ లోకి పంపించాడు. దీంతో భారత్ ఖాతా తెరిచింది. 

అనంతరం హార్ధిక్ సింగ్.. 26వ నిమిషంలో  రెండో గోల్ కొట్టాడు.  దీంతో భారత్ ఆధిక్యం 2-0 కు చేరింది.  ఆట రెండో అర్థభాగంలో   స్పెయిన్ కూడా ఎదురుదాడికి దిగింది.  కానీ శ్రీజేష్ స్థానంలో వచ్చిన గోల్ కీపర్ క్రిషన్ పాథక్ మాత్రం  వారి ప్రయత్నాలను నిలువరించాడు.   గోల్ పోస్ట్ దగ్గర గోడ కట్టినట్టుగా నిలబడి బంతిని ఆపాడు.  స్పెయిన్ పై నెగ్గిన భారత్ తన తదుపరి మ్యాచ్ లో  ఇంగ్లాండ్ తో తలపడనుంది.   జనవరి 15న ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. 

 

ఆస్ట్రేలియా అదుర్స్.. 

మరో మ్యాచ్ లో ఆస్ట్రేలియా.. 8-0 తేడాతో ఫ్రాన్స్ ను చిత్తుచిత్తుగా ఓడించింది.  భువనేశ్వర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో  ఆసీస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ జట్టు తరఫున  క్రెయిగ్ టామ్ మూడు గోల్స్ కొట్టగా  హేవర్డ్  జెరెమి కూడా మూడు గోల్స్ చేశాడు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios