చెన్నై: వెస్టిండీస్ పై జరిగిన మూడు మ్యాచుల ట్వంటీ20 సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన మూడో ట్వంటీ మ్యాచులో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. హోప్, హెట్మేర్‌లు కలిసి తొలి వికెట్‌కు 51 పరుగులు జత చేశారు. 

అయితే చాహల్ వేసిన 7వ ఓవర్ తొలి బంతికి హోప్(24), సుందర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే హెట్మేర్(26) చాహల్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరుకున్నాడు. ఈ దశలో బ్రావో  రామ్‌దిన్(15)తో కలిసి స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. అయితే సుందర్ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి రామ్‌దిన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన పూరన్ చెలరేగి ఆడాడు. బ్రావోతో కలిసి 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టు భారీ స్కోర్ సాధించేందుకు ప్రయత్నించాడదు. ఈ క్రమంలో పూరన్ 25 బంతుల్లో 4 ఫోర్లు, నాలుగు సిక్సులతో 53 పరుగులు చేసి అర్థశతకాన్ని నమోదు చేశాడు. 

బ్రావో 37 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్ రెండో బంతికే తొలి వికెట్ ను పారేసుకుంది.

కీమోపాల్ బౌలింగ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (4) బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్(17) పరుగులు చేసి థామస్ బౌలింగ్‌లో రామ్‌దిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. 

అయితే శిఖర్ ధావన్, పంత్‌ ఇన్నింగ్సును చక్కదిద్దారు. వారిద్దరు మూడో వికెట్‌కి 130 పరుగులు జోడించారు.  ధావన్, పంత్‌లు అర్ధ శతకాలు కూడా సాధించారు. అయితే కీమో పాల్ వేసిన 19వ ఓవర్ రెండో బంతికి పంత్(58) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రెండు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సి ఉండగా.. ధావన్(92) భారీ షాట్‌కు ప్రయత్నించి పొలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 

చివరి బంతికి పాండే వేగంగా సింగిల్ తీయడంతో ఉత్కంఠ పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకుంది.