పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేసిన బిసిసిఐ కి ఐసిసి నుండి హామీ అభించింది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో తమ ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులకు తగిన రక్షణ కల్పించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై తాజాగా ఐసిసి ఛైర్మన్ శశాంక్ మనోహర్ స్పందించారు. 

ప్రపంచ కప్ కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పాటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ టోర్నీలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ఆ విషయంలో బిసిసిఐ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. 

వచ్చే నెల 2వ తేదీన ఐసిసి సర్వసభ్య సమావేశంలో ఆటగాళ్ల భద్రతపై బిసిసిఐ రాసిన లేఖపై చర్చించనున్నట్లు శశాంక్ మనోహర్ తెలిపారు. వారి అందోళనను పరిగణలోకి తీసుకుంటామని...ప్రపంచ కప్ ఏర్పాట్లు విషయంలో బిసిసిఐ ని తప్పకుండా సంతృప్తి పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

 పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులు 45మంది భారత సైనికులను పొట్టపబెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్ నుండి తమ ఆటగాళ్లకు, అభిమానులకు ప్రమాదం పొంచివుందని బిసిసిఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ కప్ టోర్నీ భద్రత విషయంలో బిసిసిఐ కి ఐసిసి  హామీ ఇచ్చింది.