ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్‌దే అయింది. ఉప్పల్‌ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా..ఈ ఐపీఎల్ లో దుమ్మురేపిన కొందరు క్రికెటర్లకు మాత్రం ఐపీఎల్ అవార్డ్స్ అందజేశారు.

దీనిలో కింగ్ ఎలెవెన్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ కి మోస్ట్ స్టైయిలిష్ బ్యాట్స్ మెన్ అవార్డు దక్కింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎఫ్‌బీబీ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డుని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ ఎన్నో స్టైలిష్ షాట్లను ఆడాడు. ఈ అవార్డు కింద కేఎల్ రాహుల్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్ మనీ లభించింది.

కాగా.. ఈ అవార్డును అందజేసే సమయంలో కేఎల్ రాహుల్ అందుబాటులో లేడు. దీంతో... ఆ అవార్డ్ ని ముంబయి ఇండియన్స్ ఆటగాడు, కేఎల్ రాహుల్ ఆప్త మిత్రుడు హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. రాహుల్ అవార్డుని పాండ్యా అందుకోవడం ఇప్పుడు నెట్టింట ఓ సంచలనంగా మారింది. ఈ ఇద్దరు మిత్రులపై నెటిజన్లు ఒక రేంజ్ లో జోకులు పేలుస్తున్నారు. కాఫీ విత్ కరణ్ షోకి కూడా వీరిద్దరూ కలిసి పాల్గొని... ఇద్దరూ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.