Happy Republic Day 2022: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు ‘విశిష్ట సేవా’ పురస్కారం.. రాష్ట్రపతి చేతుల మీదుగా..
Neeraj Chopra: గతేడాది ముగిసిన ఒలింపిక్స్ లో దేశానికి బంగారు పతకం అందించినందుకు గాను నీరజ్ చోప్రాకు కేంద్ర ప్రభుత్వం ‘పరమ విశిష్ట సేవా పతకం’తో సత్కరించనుంది. జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా..
గతేడాది ఆగస్టులో జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో 130 కోట్ల భారతీయుల స్వర్ణ కాంక్ష తీర్చిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశానికి బంగారు పతకం అందించినందుకు గాను అతడికి కేంద్ర ప్రభుత్వం ‘పరమ విశిష్ట సేవా పతకం’తో సత్కరించనుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నీరజ్ కు ఈ పతకం అందించనున్నారు. చోప్రాతో పాటు మొత్తం 384 మంది గ్రహీతలు వాళ్లు దేశానికి చేసిన సేవలకు గాను గ్యాలెంట్రీ అవార్డులు అందుకోనున్నారు.
73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్ జరుగనున్నది. ఈ పెరేడ్ లో పాల్గొనబోయే చోప్రాకు రాష్ట్రపతి అవార్డు బహుకరించనున్నారు. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రాకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని కూడా అందజేసిన విషయం తెలిసిందే.
భారత ఒలింపిక్ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన రెండో (ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అయితే తొలి భారతీయుడు) భారతీయుడిగా చోప్రా రికార్డులకెక్కాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ లో భాగంగా వ్యక్తిగత విభాగంలో షూటర్ అభినవ్ బింద్రా మాత్రమే గతంలో స్వర్ణాన్ని నెగ్గాడు. ఆ తర్వాత పసిడి నెగ్గిన క్రీడాకారులు నీరజ్ చోప్రానే. భారత సైనికదళంలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న నీరజ్ చోప్రా.. ప్రస్తుతం ఈ ఏడాది జులై లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ తో పాటు ప్రపంచ ఛాంపియన్షిప్ పై దృష్టి సారించాడు. అనంతరం అతడు 2024 పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఇదిలాఉండగా.. రాష్ట్రపతి భవన్ లో మంగళవారం సాయంత్రం రామ్నాథ్ కోవింద్ 384 మంది రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ, ఇతర అవార్డులతో సత్కరించనున్నారు.అవార్డులలో 12 శౌర్య చక్ర, 29 పరమవిశిష్ట సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ద సేవా పతకాలు, 13 యుద్ధ సేవా పతకాలు, 3 బార్ టు విశిష్ట సేవా పతకాలు, 122 విశిష్ట సేవా పతకాలు, 81 సేన పతకాలు (గ్యాలెంట్రీ), 2 వాయుసేన పతకాలు, 40 సేన పతకాలు, 8 నేవీ పతకాలు, 14 వాయుసేన పతకాల (డివోషన్ టు డ్యూటీ) విజేతలను కోవింద్ సత్కరించనున్నారు.