భారత్-వెస్టిండిస్ ల మధ్య ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని  కోల్ కతాలో టీ20 మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్ ప్రతిస్టాత్మకంగా జరిగిన ఆరంభమైన ఈ మ్యాచ్ లో టీంఇండియా విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ ఆరంభానికి ముందు బిసిసిఐ, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (సీఏబీ) వ్యవహరించిన తీరుపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ట్విట్టర్ వేదికన ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ చేత టీ20 మ్యాచ్ ప్రారంభానికి సూచికగా గంట మోగింపజేయడమే గంబీర్ ఆగ్రహానికి కారణం. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నిషేదం కూడా ఎదుర్కొన్న వ్యక్తి చేత అధికారిక కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ బిసిసిఐ, సిఎబి లపై గంబీర్ గరం అయ్యాడు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా తన కోపాన్ని వ్యక్తపర్చాడు.    

విండీస్ తో ఈడెన్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా గెలిచివుండవచ్చు.. కానీ  భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ), బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సిఎబి) మాత్రం ఓడిపోయాయంటూ గంబీర్ ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నాడు. క్రికెట్ లో అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన ఈ సంస్థలు ఆదివారం కదా అని  సెలవు తీసుకున్నట్లున్నాయంటూ ఎద్దేవా చేశాడు. అతన్ని(అజారుద్దిన్) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఇచ్చారని తెలుసు. కానీ ఇలా అతడి చేత  బెల్ కొట్టించడం షాక్ కు గురిచేసిందంటూ గంబీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపర్చాడు.