Asianet News TeluguAsianet News Telugu

విశాఖకు మారిన వేదిక: బిసిసిఐపై దుమ్మెత్తిపోసిన గంగూలీ

షెడ్యూల్‌ ప్రకారం విండీస్‌తో జరగాల్సిన రెండో వన్డేకు ఇండోర్‌ స్టేడియంలో జరగాలి. కానీ, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు, బీసీసీఐకి మధ్య టికెట్ల వివాదం చెలరేగడంతో రెండో వన్డేను విశాఖకు తరలించారు. దానిపై మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు  కూడా అయిన సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. 

Ganguly expresses anguish at BCCI
Author
Kolkata, First Published Oct 4, 2018, 11:52 AM IST

కోల్‌కతా: వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతున్న రెండో  వన్డే మ్యాచు వేదికను విశాఖపట్నానికి మార్చడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బిసిసిఐపై తీవ్రంగా మండిపడ్డారు. షెడ్యూల్‌ ప్రకారం విండీస్‌తో జరగాల్సిన రెండో వన్డేకు ఇండోర్‌ స్టేడియంలో జరగాలి. కానీ, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు, బీసీసీఐకి మధ్య టికెట్ల వివాదం చెలరేగడంతో రెండో వన్డేను విశాఖకు తరలించారు.

దానిపై మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు  కూడా అయిన సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. వేదిక మార్పుపై బీసీసీఐ తీరును ఆయన తప్పుబట్టాడు. బోర్డు తీరు ఇలాగే ఉంటే రాష్ట్ర సంఘాలు మ్యాచ్‌లు నిర్వహించడం కష్టమని ఆయన అన్నారు.

ఈ వివాదంలో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘానికే తన పూర్తి మద్దతు ఉంటుందని, వారి ఇబ్బందులేమిటో తనకు తెలుసునని, మ్యాచ్‌ల నిర్వహణకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం అవసరమని, పోలీసులు చాలా నామమాత్రంగా ఫీజు తీసుకుని రక్షణ కల్పిస్తారని అన్నారు.

ఎంతో మంది సాయపడతారని, వాళ్లందరికీ తాము కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వాల్సి ఉంటుందని, టికెట్లు కొనుక్కోమని వారికి  తాము చెప్పలేమని, ఇంకా తమ సంఘాలకు అనుబంధంగా ఉన్న వాళ్లెందరికో పాస్‌లు ఇవ్వాలని అన్నారు. 

కాంప్లిమెంటరీల విషయంలో బీసీసీఐ ఏం చేయాలని అనుకుంటుందో అర్థం కావడం లేదని, మ్యాచ్‌ను తరలించాలనుకుంటే తరలించుకోవచ్చునని, తామైతే ఈ విషయంలో రాజీపడబోమని అన్నారు. 

ఇప్పటికే టికెట్లు ప్రింటింగ్‌ ప్రక్రియ పూర్తయిందని,ఒకవేళ వేదికను మార్చాలనుకుంటే అది వారి ఇష్టమని, ఇందులో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఈడెన్‌లో మ్యాచ్ జరుగుతుందనే ఆశిస్తున్నానని అన్నారు.

నవంబరు 4న కోల్‌కతాలో భారత్‌-విండీస్‌ ల మధ్య తొలి ట్వంటీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోల్ కతాలో ఆ మ్యాచు జరుగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

బీసీసీఐ తాజా నిబంధనల ప్రకారం మొత్తం టికెట్లలో 90 శాతం విక్రయానికి పెట్టాలి.  10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వాలి. ఇదే వివాదానికి దారి తీసింది. కాంప్లిమెంటరీ పాస్‌లను 10 శాతంగా పేర్కొనడంతో నిర్వహణ సాధ్యం కాదనేది క్రికెట్ సంఘాలు వాదిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios