Asianet News TeluguAsianet News Telugu

అక్కడ ఫుట్‌బాల్ ఉంటే చాలు.. ఫుడ్డుతో పనిలేదు

అక్కడ ఫుట్‌బాల్ ఉంటే చాలు.. ఫుడ్డుతో పనిలేదు

Foot ball mania starts all over

హైదరాబాద్: సౌరవ్ గంగూలీ క్రికెట్ కోసం షర్టు విప్పేస్తే... పశ్చిమ బెంగాల్ ప్రజలు మాత్రం సాకర్ కోసం అవసరమైతే షర్టులు చించేసుకుంటారు. కొద్దిరోజుల్లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సంబరాలు మొదలు కానున్నాయి. ఇండియాలో ఎక్కడైనా క్రికెట్టే కానీ అక్కడ మాత్రం ఆ ఊసే ఉండదు. అక్కడి వారికి ఫుట్‌బాల్ ఆటే ఆహారం, ఆక్సిజను, నిద్ర ఇంకా చెప్పాలంటే జీవితం. ఇదేదో కోల్‌కతా సిటీకే పరిమితమైందనకుంటే పొరపాటు. మారుమూల పర్వత ప్రాంతాల జనాలదీ ఇదే వరస. ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి ఆ రాష్ట్రం మొత్తానికి సాకర్ పూనకం వచ్చేస్తుంటుంది.


పీలేతో మొదలు
అప్పుడెప్పుడో 1977లో పీలే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. అది చూసి మనోళ్ళు వెర్రెత్తిపోయారు. ఆ తర్వాత కోల్‌కతా జనాలకు 1986లో డిగో మరడోనా రూపంలో కొత్త హీరో దొరికాడు. దాంతో ఫుట్‌బాల్ అంటే ప్రాణమిచ్చేసేంత రేంజ్‌కు చేరుకున్నారు. వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు బ్రెజిల్, అర్జెంటీనా అంటూ సిటీ జనాలు రెండుగా చీలిపోతుంటారు. తరాలు మారినా, కాలం మారినా ఫుట్‌బాల్ పట్ల వారి ఆరాధనా భావంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. 
ఈసారి కూడా అదే ధోరణి. కోల్‌కతా‌లో ఎక్కడా చూసినా బ్రెజిల్, అర్జెంటీనా సందడే. గోడలపై ప్లేయర్స్ బొమ్మలు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల జెండాలు, పెద్ద పెద్ద కటౌట్‌లు. బ్యానర్లు, వాల్ పోస్టర్ల‌కు అంతే లేదు.


దసరా 10 రోజులే.. పుట్‌బాల్ పండగ నెల రోజుల పైమాటే
కాలేజ్ స్టూడెంట్ రామ్ గంగూలీ మాటల్లో చెప్పాలంటే.. క్రికెట్‌ను మతంగా భావించే మిగతా భారత దేశానికి ఇదంతా చూడ్డానికి ఫన్నీగా అనిపించవచ్చు కానీ కోల్‌కతా వాసులకు మాత్రం ఇదో సీరియస్ వ్యవహారం. ఏడాదికి ఓ సారి వచ్చే దసరా పండుగ మహా అయితే 10 రోజులు ఉంటుంది. కానీ నాలుగేళ్ళకు ఒకసారి వచ్చే ఫుట్‌బాల్ పండుగ మాత్రం నెల రోజులపైనే జరుగుతుంది. జెర్సీలనే కొత్త బట్టల్లా తొడుక్కుంటారు. అంతా కలిసి మ్యాచ్‌లు చూస్తారు. మర్నాడు కూడా దాని గురించే డిస్కస్ చేసుకుంటారు. ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి. అలాగని మరీ కొట్టుకునేంతగా ఉండదు.


కొండ ప్రాంతాల్లోనూ ఇదే క్రేజ్
కొండ ప్రాంతాల్లోని జనాలు సైతం ఫుట్‌బాల్‌ను ఆటను పిచ్చ పిచ్చగా చూసేస్తుంటారు. అక్కడ కార్ల విండోలకు క్లబ్ స్టిక్కర్లు కనపడుతుంటాయి. వరల్డ్ కప్ దగ్గర పడుతుందంటే చాలు నాలుగు రోడ్ల జంక్షన్లలో, బిల్డింగుల పైన వారి అభిమాన టీమ్స్ జెండాలు ఎగరేస్తుంటారు. కోల్‌కతా వారికి భిన్నంగా ఇక్కడి ప్రజలు జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ లాంటి యూరోపియన్ దేశాలకు పెద్ద పీట వేస్తుంటారు.
క్యాబ్ డ్రైవర్ అంకుర్ తమంగ్ మాటల్లో చెప్పాలంటే..  ఇక్కడి వారంతా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు రెగ్యులర్‌గా చూస్తుంటారు. ప్రేయర్స్, వారు ఆడే స్టయిల్ వీరికి బాగా తెలుసు. ఇక్కడ కూడా అక్కడక్కడా అర్జెంటీనా, బ్రెజిల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరు ఎవరికి సపోర్ట్ చేసినా కానీ పెద్దా చిన్నా తేడా లేకుండా అందరికీ వరల్డ్ కప్ ఫీవర్ పట్టుకుంటుంది.

 
గిరిజనుల్లోనూ అదే జోరు
రాష్ట్రంలో పశ్చిమ ప్రాంతమైన జంగల్ మహల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం. జార్ఖండ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో సదుపాయలు ఉండవు. అవకాశాలు మచ్చుకైనా కనిపించవు. గిరిజనులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయినా సిటీ వాళ్లతో పోలిస్తే ఫుట్‌బాల్‌ను అభిమానించడంలో ఏ మాత్రం తీసిపోరు. ఇప్పటికీ టీవీ అంటే ఇక్కడ ఒక అరుదైన అద్భుతం. ఏడో తరగతి చదువుతున్న సామ్రాట్ సంతాల్ మాటల్లో చెప్పాలంటే.. కుర్రకారు వరల్డ్ కప్ మ్యాచ్‌లు టీవీలో చూడ్డానికి రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళుతుంటారు. స్కూల్ క్లాస్ రూమ్‌లో కుదురుగా కూర్చోవడం కష్టమే. మరీ ముఖ్యంగా సబ్జెక్ట్ బోర్ కొడుతుంటే దాన్ని భరించడం అంత తేలిగ్గాదు. మాస్కో టైమ్‌కు, ఇక్కడి టైమ్‌కు తేడా రెండున్నర గంటలే. షెడ్యూల్ చూస్తే ఈసారి మ్యాచ్‌ల్లో చాలావరకు సాయంత్రం పూటే ఉంటాయి. ఫ్రెండ్ ఇంటికి వెళ్లి టీవీతో కాలక్షేపం చేస్తే సరి.అలా చూసినప్పుడు, జూన్ 14 వచ్చేసరికి, పశ్చిమ బెంగాల్‌లో నిత్యం కనిపించే రాజకీయ ఉద్రిక్తతలు, ఇతర అంశాలను జనం అటక ఎక్కించేస్తారని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios