ఫిఫా వరల్డ్ కప్ 2022: లియోనెల్ మెస్సీ మ్యాజిక్... మెక్సికోపై అర్జెంటీనా అద్భుత విజయం...
మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం అందుకున్న అర్జెంటీనా... సౌదీ అరేబియాతో ఓటమి తర్వాత ప్రీక్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉంచుకున్న అర్జెంటీనా..
ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో స్టార్ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. పోర్చుగల్ సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో, వరుసగా ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో గోల్స్ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కూడా తన అద్భుత ఆటతీరుతో అభిమానులను అలరించాడు...
మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో అద్భుత విజయం అందుకుంది అర్జెంటీనా. ఆట ఫస్టాఫ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ సాధించలేకపోయాడు. సెకండాఫ్‌లో మెక్సికోపై పూర్తి డామినేషన్ చూపించింది అర్జెంటీనా. ఆట 64వ నిమిషంలో గోల్ సాధించిన లియోనెల్ మెస్సీ..
18 ఏళ్ల 357 రోజుల వయసులో తొలి వరల్డ్ కప్ గోల్‌ని అసిస్ట్ చేసిన లియోనెల్ మెస్సి, అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా ఉన్నాడు. తాజాగా 35 ఏళ్ల 155 రోజుల వయసులో వరల్డ్ కప్ గోల్ చేసి, అతి పెద్ద వయసులో గోల్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నిలిచాడు.
లియోనెల్ మెస్సీకి ఇది 8వ ఫిఫా వరల్డ్ కప్ గోల్ కాగా, 2022లో అర్జెంటీనాకి 13వ గోల్. ఓవరాల్‌గా అర్జెంటీనా తరుపున మెస్సీకి 93వ ఇంటర్నేషనల్ గోల్. మెస్సీ గోల్ సాధించిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఆడిన అర్జెంటీనాకి 87వ నిమిషంలో మరో గోల్ దక్కింది.
87వ నిమిషంలో గోల్ చేసిన ఎంజో ఫెర్నాండేజ్, అర్జెంటీనా 2-0 తేడాతో ఆధిక్యం అందించాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకూ నిలుపుకున్న అర్జెంటీనా జట్టు, ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో ప్రీ క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
ఐదురోజుల క్రితం సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో 1-2 తేడాతో ఓడిపోయింది అర్జెంటీనా. ఆట 10వ నిమిషంలో దక్కిన పెనాల్టీని లియోనెల్ మెస్సీ గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యం అందించినా ఆ తర్వాత సౌదీ అరేబియా ప్లేయర్లు వరుసగా రెండు గోల్స్ సాధించారు. సలే అల్షేరీ 48వ నిమిషంలో, సలీం అడ్వాసరీ 53వ నిమిషంలో గోల్స్ చేయడంతో 1-2 తేడాతో సంచలన విజయం అందుకుంది సౌదీ అరేబియా..