కలిసిపోయిన విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్.. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, భుజం తడుతూ..
విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ లు కలిసిపోయారు. మాటలయుద్ధంతో తీవ్రస్థాయిలో గొడవపడి ఫైన్ కట్టిన ఈ ఆటగాళ్లిద్దరూ బుధవారం జరిగిన మ్యాచ్ లో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ, సరదాగా నవ్వుతూ కనిపించారు.
రాజకీయాల్లోనే కాదు ఆటల్లోనూ శాశ్వత మితృత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదని నిరూపించారు విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్. గత ఐపీఎల్ లో బెంగుళూరు, లఖ్ నవూ మధ్య జరిగిన ఓ మ్యాచ్లో.. ఇరుజట్ల ఆటగాళ్లయిన నవీన్, విరాట్ల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఒకరి మీద ఒకరు మాటలతో యుద్ధం చేసుకున్నారు. ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడైన నవీన్ ఉల్ హక్ ను అప్పటినుంచి సోషల్ మీడియాలో క్రికెట్ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఆ తర్వాత నవీన్ ఉల్ హక్ కూడా పరోక్షంగా కోహ్లీ మీద సోషల్ మీడియాలో పోస్టులుపెట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని గుసగుసలు వినిపించాయి. బుధవారం జరిగిన ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో దీనికి భిన్నమైన సీన్ కనిపించింది. నవీన్ బ్యాటింగ్ కు రాగానే.. వీటన్నింటినీ గుర్తు చేసుకుని ప్రేక్షకులు గేలి చేయడం మొదలుపెట్టారు.
క్రికెట్ వరల్డ్ కప్ 2023 : అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డ్ బద్దలు...
అది గమనించిన కోహ్లీ.. అలా చేయొద్దని ప్రేక్షకులను వారించడం కనిపించింది. విరాట్ బ్యాటింగ్ సమయంలో నవీన్ ఉల్ హక్ స్వయంగా కోహ్లీ దగ్గరికి వచ్చిదగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతని చొరవకు విరాట్ కోహ్లీ కూడా సానుకూలంగా స్పందించాడు. చేతిలో చేయివేసి చిరునవ్వుతో నవీన్ ఉల్ హక్ భుజం తట్టాడు. ఇది చూసిన అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య గొడవ సద్దుమనిగి స్నేహం వెల్లివిరిసిందని సంతోషపడ్డారు. ఈ పరిణామం హ్యాపీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం, అక్టోబర్ 11న భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్-ఉల్-హక్ స్నేహపూర్వకంగా కలిసిపోవడం చూసిన రవిశాస్త్రి ఆనందపడ్డారు.
ఈ ఏడాది ప్రారంభంలో, మేలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) తలపడినప్పుడు కోహ్లీ, నవీన్ వివాదంలో చిక్కుకున్నారు. దీని కారణంగా కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించగా, నవీన్ 50 శాతం జరిమానా విధించారు. అయితే, ఢిల్లీలో జరిగిన ప్రపంచకప్ పోటీలో వీరిద్దరూ మంచి ఉత్సాహంతో కనిపించారు.
2017 నుండి 2021 వరకు భారత ప్రధాన కోచ్‌గా పనిచేసిన రవి శాస్త్రి, కోహ్లి, నవీన్‌లు మైదానంలో స్కోర్‌లను సెటిల్ చేసిన విధానంతో ఆకట్టుకున్నాడు.
“క్షణికావేశంలో వారు సహనం కోల్పోయి మాటలతో దాడి చేసుకుని ఉండవచ్చు. అయితే ఈరోజు జరిగిందో చూస్తే చాలా బాగుంది. ఆరు నెలల క్రితం గొడవను మరో విధంగా పరిష్కరించుకోవచ్చని వారిద్దరూ గ్రహించారు. ఏది జరిగినా మనసు మీదికి తీసుకోవద్దు’’ అని శాస్త్రి అన్నారు.