ఫిఫా వరల్డ్‌కప్ అంటే క్రేజే కాదు.. ఎన్నో దేశాలకు పరువు సమస్య.. అలాంటి అంచనాల మధ్య గ్రౌండ్‌లో ఆడే ఆటగాడిపై ఎంతటి ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు చేసే చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి పొరపాటు చేసిన ఓ స్టార్ ఆటగాడు దారుణహత్యకు గురయ్యాడు.. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విషాద సంఘటనగా చెప్పుకునే ఈ ఘటన వివరాల్లోకి వెళితే... 1994 ఫిఫా ప్రపంచకప్‌‌లో కొలంబియా ఫుట్‌బాల్ ప్లేయర్ ఆండ్రెస్ ఎస్కోబార్ చేసిన పొరపాటకు ఆ జట్టు టోర్నీ నుంచి తప్పుకోవడమే కాకుండా.. ఏకంగా అతని ప్రాణాలనే బలిగొంది.

అమెరికా ఆతిథ్యమిచ్చిన నాటి ప్రపంచ‌కప్‌లో హాట్ ఫేవరేట్‌‌గా బరిలోకి దిగిన కొలంబియాకు తొలిమ్యాచ్‌లో రొమేనియా షాకిచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన తర్వాతి మ్యాచ్‌లో కొలంబియా.. అమెరికాతో తలపడాల్సి వచ్చింది. అంతటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో డిఫెండర్ ఎస్కోబార్ పెద్ద తప్పు చేశాడు.. గోల్‌‌పోస్ట్ సమీపంలో జాన్ హార్కర్ క్రాస్ ఆపే ప్రయత్నంలో తడబడి సొంత గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపాడు.. దీంతో అమెరికా ఖాతాలో గోల్ వచ్చింది.

ఈ మ్యాచ్‌లో యూఎస్ మరో గోల్ కొట్టి కొలంబియాను 2-1 తేడాతో ఓడించింది. ఈ ఫలితంతో అమెరికా సెకండ్ రౌండ్‌లోకి ప్రవేశించగా.. కొలంబియా ఇంటి ముఖం పట్టింది. అయితే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌పై కొలంబియా గెలుస్తుందని భారీ స్థాయిలో బెట్టింగ్ కట్టింది ఓ మాఫియా ముఠా... కాని ఫలితం తారుమారవ్వడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ గ్యాంగ్‌.. ఓ రోజు క్లబ్‌కు వెళ్లి తిరిగొస్తున్న ఎస్కో‌బార్‌ను పార్కింగ్ ప్రదేశంలో తుపాకీతో కాల్చి చంపింది..

అతని శరీరంపై ఆరు రౌండ్లు కాల్చిన దుండగులు.. ప్రతి సందర్భంలో గోల్.. గోల్..అని నినాదాలు చేస్తూ నువ్వు తప్పు చేయడమే దీనికి కారణం అంటూ అరిచారు.. ఈ ఘటనతో ఫుట్‌బాల్ ప్రపంచం ఉలిక్కిపడింది. అతని అంతిమ సంస్కారాలకు 1,20,000 మంది అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎస్కోబార్ స్మారకార్థం 2002లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. 

"