China Masters 2023: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీఫైనల్లోకి భారత జోడీ
China Masters 2023 badminton: క్వార్టర్‌ఫైనల్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కర్నాండో, డేనియల్ మార్థిన్‌లపై 21-16, 21-14తో 46 నిమిషాల్లో విజయం సాధించగా, ప్రణయ్ 9-21 14-21తో జపాన్‌కు చెందిన కోడై నారోకా చేతితో ఓడిపోయాడు.
Satwik-Chirag pair reaches semifinals: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ భారత టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు సెమీఫైనల్‌లోకి ప్రవేశించారు. అయితే, పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్. ప్రణయ్ ఓడిపోవడంతో సింగిల్స్ లో భారత్ పోరు ముగిసింది.
వివరాల్లోకెళ్తే.. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లోకి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిలతో కూడిన భారత జోడీ దూసుకెళ్లింది. టాప్ సీడ్ సాత్విక్-చిరాగ్ జోడీ 21-16, 21-14తో ప్రపంచ 13వ ర్యాంకర్ లియో రోలీ కార్నాండో-డేనియల్ మార్తిన్ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ రసవత్తరంగా ప్రారంభమైంది. అయితే 14-14తో అటాకింగ్ షాట్ల దాడితో భారత జోడీ ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించింది.
కాగా, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ తన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు తీవ్రంగా శ్రమించి 9-21, 14-21 తేడాతో జపాన్ కు చెందిన ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతక విజేత కొడై నరోకా చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో సింగిల్స్ లో భారత్ పోరు ముగిసింది. ఈ ఏడాది ఇండోనేషియా సూపర్ 1000, కొరియా సూపర్ 500, స్విస్ సూపర్ 300 టైటిల్స్ నెగ్గిన సాత్విక్-చిరాగ్ జోడీ తదుపరి మ్యాచ్ లో చైనా జోడీ హీ జీ టింగ్, రెన్ జియాంగ్ యూ తో తలపడనుంది.