న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించి భారత క్రికెటర్ చాహల్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. 2016 జూన్‌లో చాహల్‌ భారత జట్టు తరఫున అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

జింబాబ్వే పర్యటనలో తన అనుభవాలను కొన్నింటిని అతను పంచుకున్నాడు. ఆ పర్యటనలో ధోనీ చేతుల మీదుగానే తాను వన్డే క్యాప్‌ అందుకున్నట్లు తెలిపాడు. ధోనీని కలవడం అదే తొలిసారి అని, ధోనీ ముందు మాట్లాడటానికి కూడా తాను భయపడేవాడినని చెప్పాడు. 

అయితే,  ధోనీ మాత్రం ఎంతో సింపుల్‌గా ఉంటాడని, చాలా బాగా మాట్లాడుతాడని, అతను మాట్లాడే తీరు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందేనని చాహల్ అన్నాడు. జట్టులో అంత సీనియర్‌ ఆటగాడు అలా మాట్లాడుతున్నాడేమిటని ఆశ్చర్యపోతామని అన్నాడు.

ధోనీ గురించి చాహల్ ఇలా చెప్పాడు - "జింబాబ్వేతో మ్యాచ్‌లో నేను ధోనీని మహి సర్‌ అని పిలిచాను. రెండు ఓవర్ల తర్వాత ధోనీ నన్ను పిలిచి మహి, ధోనీ, మహేంద్ర సింగ్‌ ధోనీ, భాయ్‌..ఇందులో ఏ పేరుతో పిలిస్తే బాగుంటుందో నువ్వే ఎంచుకుని అలా పిలువు అని అన్నాడు. నేను అయితే ఆ సమయంలో కాస్త షాక్‌ తిన్నా"  అని చాహల్ వివరించాడు.