నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే ఫిఫా ప్రపంచకప్‌పై అభిమానులు పెట్టుకునే ఆశలు అన్నీ ఇన్నీ కావు.. గెలిస్తే సత్కారాలు ఎలా ఉంటాయో.. ఓడితే చీత్కారాలు అలాగే ఉంటాయి. ఆటగాళ్లను హీరోలుగా కొలిచే ఫ్యాన్స్.. ఏ మాత్రం తేడా వచ్చినా చంపడానికి కూడా వెనుకాడరు. ఇందుకు సంబంధించి గతంలో ఎన్నో అనుభవాలు. తాజా ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి జట్టుగా.. హాట్‌ ఫేవరేట్‌గా రంగంలోకి దిగిన బ్రెజిల్... బెల్జియం చేతిలో ఓడిపోవడాన్ని బ్రెజిల్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అవమాన భారంతో స్వదేశానికి చేరుకున్న జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఫ్యాన్స్ రాళ్లు, గుడ్లతో స్వాగతం పలికారు.. వారు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసి నానా హంగామా చేశారు..భద్రతా సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా కాల్పులు జరపాల్సి  వచ్చింది. గత శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో బ్రెజిల్ ఓడిపోయింది. ఐదుసార్లు విశ్వవిజేతగా అవతరించిన సాంబా జట్టు దారుణ పరాజయాన్ని మూటకట్టుకోవడం ఈ వరల్డ్‌కప్‌లోనే సంచలనం.