జాతీయ జట్టులో దేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య పోరాడుతున్న విషయం తెలిసిందే. అతడి చికిత్సకయ్యే ఖర్చు కూడా  భరించలేక ధీన స్థితిలో వున్న అతడి కుటుంబం బిసిసిఐని సాయం అర్థించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో తమ తోటి ఆటగాడికి ఇలాంటి పరిస్ధితి రావడంతో చలించిపోయిన భారత మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యువ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అయితే ఏకంగా మార్టిన్ చికిత్స కోసం బ్లాంక్ చెక్ రాసిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. 

మార్టిన్ చికిత్సకయ్యే ఖర్చు కోసం తనవంతు సాయం చేయడానికి కృనాల్ ముందుకు వచ్చినట్లు బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ సంజయ్‌ పటేల్‌ తెలిపారు. అతడు ఓ బ్లాంక్ చెక్ ను ఆయనకిచ్చి మార్టిన్ కుటుంబ సభ్యులకు లక్షకు తక్కువ కాకుండా వుండేలా ఎంతైనా ఆర్థిక సాయం చేయమని కోరినట్లు ‘ది టెలిగ్రాఫ్‌’పత్రిక పేర్కొంది. 

గతేడాది డిసెంబర్ 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో జాకబ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కాలేయం, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. దీంతో ఇప్పటివరకు అతడి చికిత్స ఖర్చులు భరించిన కుటుంబ సభ్యులు ఆర్థికంగా చితికకిపోవడంతో బిసిసిఐ సాయం కోరడంతో అతడి ఆనారోగ్యం, కుటుంబ ధీన పరిస్ధితి గురించి బయటపడింది. ప్రస్తుతం అతడు వడోదరలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స పొందుతున్నాడు. 

ఇప్పటికే బిసిసిఐతో పాటు మాజీ క్రికెటర్లు సౌరవ్‌ గంగూలీ,జహీర్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌, రవిశాస్త్రిలె మార్టిన్‌ కుటుంబానికి అండగా నిలిచారు. తాజాగా మరో యువ క్రికెటర్, బరోడా ఆటగాడు కృనాల్ పాండ్యా కూడా మార్టిన్ చికిత్సకోసం ఆర్థిక సాయం చేశాడు. 

అంతర్జాతీయ స్థాయిలో మార్టిన్ మొత్తం 10 వన్డే మ్యాచులాడాడు. అతడు 2001లో బరోడా జట్టుకు రంజీ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర వహించాడు. 138 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మార్టిన్ 9,192 పరుగులు చేశాడు.

సంబంధిత వార్తలు  

చావు బతుకుల్లో టీమిండియా మాజీ క్రికెటర్.. సాయం కోసం ఎదురుచూపులు