టీం ఇండియా కొత్త కోచ్ ఎవరు..? ఇప్పుడు బీసీసీఐ కూడా ఇదే ఆలోచనలో ఉంది. టీం ఇండియా హెడ్ కోచ్, సహాయ సిబ్బంది కోసం దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుంది. వచ్చే నెలలో జరగనున్న వెస్టిండీస్ టూర్ తో రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగియనుంది. ఈ క్రమంలో కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ రవిశాస్త్రి కోచ్ గా కొనసాగాలని అనుకున్నా... ఆయన కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  వాస్తవానికి వరల్డ్ కప్ తో రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగిసింది. అయితే.. వెస్టిండీస్ టూర్ ని దృష్టిలో ఉంచుకొని అప్పటి దాకా ఆయన కాంట్రాక్ట్ ని పొడిగించారు.

రవిశాస్త్రితోపాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ల కాంట్రాక్ట్‌ను మరో 45 రోజులు పొడిగించారు. వరల్డ్‌కప్‌ వైఫల్యం నేపథ్యంలో ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసు తప్పుకొన్నారు. సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఆలోపే కోచ్‌ను ఎంపికచేయాలని బీసీసీఐ నిర్ణయించింది. 

కోచ్‌లతోపాటు టీమ్‌ మేనేజర్‌ పోస్టుకు కూడా దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అనిల్‌ కుంబ్లే తర్వాత 2017లో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి నియమితుడయ్యాడు. అతడి హయాంలో ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ మినహా భారత్‌ ఎటువంటి మేజర్‌ టోర్నీలు గెలవలేదు.