ఆసియా పారా గేమ్స్ 2023 : జావెలిన్ త్రో లో సుందర్ సింగ్ గుర్జార్‌కు గోల్డ్ మెడల్
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2023లో భారత్‌కు బుధవారం (అక్టోబర్ 25) ఫీల్డ్ డే ఉంది. పురుషుల జావెలిన్ T46 ఈవెంట్‌లో సుందర్ సింగ్ గుర్జార్ 68.60 మీటర్ల చివరి త్రోతో బంగారు పతకాన్ని ముద్దాడాడు.

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2023లో భారత్‌కు బుధవారం (అక్టోబర్ 25) ఫీల్డ్ డే ఉంది. పురుషుల జావెలిన్ T46 ఈవెంట్‌లో సుందర్ సింగ్ గుర్జార్ 68.60 మీటర్ల చివరి త్రోతో బంగారు పతకాన్ని ముద్దాడాడు. అంతేకాదు.. తన చివరి త్రో తో కొత్త ప్రపంచ రికార్డును సైతం సృష్టించాడు. రింకూ హుడా 67.08 మీటర్ల త్రో తో రజత పతకాన్ని గెలుచుకోగా.. అజీత్ సింగ్ యాదవ్ 63.52 మీటర్ల త్రో తో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే రెండుసార్లు పారాలింపిక్ బంగారు పతక విజేత దేవేంద్ర ఝఝరియా నాలుగో స్థానంలో నిలిచాడు.
కాగా.. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో భారత బృందం అంచనాలకు మించి రాణిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే ఇండియా 35 పతకాలు సాధించి ఔరా అనిపిస్తోంది. ఆసియా పారా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఐదవ స్థానంలో వుండగా.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. త్వరలోనే టాప్ 3కి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
తొలి రోజే 4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్య పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు భారత క్రీడాకారులు . కనోయింగ్‌లో ప్రాచీ యాదవ్ రెండు విభాగాల్లో స్వర్ణంతో పాటు రజతాన్ని గెలుచుకుంది. అటు పురుషుల కేఎల్ 3లో ఆమె భర్త మనీష్ కౌరవ్ కాంస్యం సాధించాడు. 44.60 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని మూడో స్థానంలో నిలిచాడు.
మరోవైపు టోక్యో పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అవని లేఖరా .. ఆసియా పారా క్రీడల్లోనూ బంగారు పతకాన్ని అందుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఆమె 249.6 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. హైజంప్ విభాగంలో టీ63 కేటగిరీలో మూడు మెడల్స్ భారత్‌కే దక్కాయి. శైలేష్ కుమార్‌కు బంగారు, తంగవేలుకు రజతం, రామ్ సింగ్‌కు కాంస్య పతకం దక్కింది.