Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: గోల్డ్ మెడల్ గెలిచిన భారత కబడ్డీ టీమ్.. గంటన్నరకు పైగా ఆట ఆగి, హై డ్రామా మధ్య..

ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 33-29 పాయింట్ల తేడాతో నెగ్గిన భారత పురుషుల కబడ్డీ జట్టు.. ఒక్క రైడ్ కోసం గంటకు పైగా ఆగిన ఆట.. 

Asian Games 2023: Indian Men's Kabaddi team Wins Gold medal after beating iran in Final CRA
Author
First Published Oct 7, 2023, 3:00 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో స్వర్ణం సాధించింది భారత పురుషుల కబడ్డీ జట్టు.. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి 17-13 పరుగుల తేడాతో మంచి ఆధిక్యంలో నిలిచింది టీమిండియా..

అయితే సెకండ్ హాఫ్‌లో ఇరాన్ ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. 19-24 స్కోరు నుంచి 25-25 పాయింట్లతో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ప్రతీ పాయింట్ కోసం ఇరు జట్ల మధ్య హై డ్రామా నడిచింది..

ఆట మరో 65 సెకన్లలో ముగుస్తుందని పవన్ చేసిన రైడ్ విషయంలో ఇరు జట్ల మధ్య గొడవ జరిగింది. డూ ఆర్ డై రైడ్‌కి వెళ్లిన పవన్, డిఫెండవర్లు ఎవ్వరినీ తాకకముందే లాబీలోకి ఎంటర్ అయ్యాడు. అయితే అతన్ని అవుట్ చేసేందుకు ప్రయత్నించిన ఇరాన్ డిఫెండర్లు ముగ్గురు లాబీలోకి ఎంటర్ అయ్యారు..

ఈ రైడ్‌పై ఇరాన్‌కి ఒక్క పాయింట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు రిఫరీ. అయితే భారత్ రివ్యూ తీసుకోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీనిపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆటకు కాసేపు అంతరాయం కలిగిన తర్వాత అంపైర్లు, భారత్‌కి 3 పాయింట్లు, ఇరాన్‌కి ఒక్క పాయింట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

పేలవమైన అంపైరింగ్ కారణంగా దాదాపు గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. భారత్, ఇరాన్ అధికారులు, అంపైర్లతో చర్చించిన తర్వాత భారత్‌కి 3 పాయింట్లు ఇవ్వడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. 31-29 దగ్గర ఆట తిరిగి ప్రారంభమైంది. డూ ఆర్ డై రైడ్‌కి వచ్చిన ఇరాన్ రైడర్‌ని అవుట్ చేసిన భారత జట్టు, ఆ తర్వాత ఆఖరి రైడ్‌లో మరో పాయింట్ తీసుకొచ్చింది. దీంతో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం దక్కింది. భారత మహిళా కబడ్డీ జట్టు కూడా స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. 
 

1990, 1994, 1998, 2002, 2006, 2010, 2014 ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత కబడ్డీ పురుషుల జట్టు, గత ఏషియన్ గేమ్స్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈసారి మరోసారి స్వర్ణంతో కమ్‌బ్యాక్ ఇచ్చింది భారత కబడ్డీ జట్టు.. 

మహిళల హాకీలో భారత్ కాంస్య పతకం సాధించింది. జపాన్‌తో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయాన్ని అందుకుంది భారత్.  తొలి సగం ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1 తేడాతో సమంగా నిలిచాయి. అయితే మ్యాచ్ మరో 10 నిమిషాల్లో ముగిస్తుందని ఛాను, పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలిచి 2-1 తేడాతో భారత్‌కి ఆధిక్యం అందించింది. 

రెజ్లింగ్‌లో 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ దీపక్ పూనియా ఫైనల్ చేరాడు. జపాన్ రెజ్లర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-3 తేడాతో విజయాన్ని అందుకున్నాడు దీపక్ పూనియా.. 

Follow Us:
Download App:
  • android
  • ios