ఏషియన్ గేమ్స్ 2023 : భారత్‌కు పతకాల పంట.. దేశం గర్వించేలా చేశారంటూ అథ్లెట్లపై ఏఎఫ్ఐ అధ్యక్షుడు ప్రశంసలు
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రికార్డు స్థాయిలో దేశానికి పతకాలను సాధించి పెట్టారు. దీనిపై అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అడిల్లే సుమరివాలా హర్షం వ్యక్తం చేశారు. దేశం గర్వించేలా చేశారంటూ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రికార్డు స్థాయిలో దేశానికి పతకాలను సాధించి పెట్టారు. భారత్ ట్రాక్-అండ్-ఫీల్డ్ అథ్లెట్ల ప్రదర్శనపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అడిల్లే సుమరివాలా ..కొన్ని దేశాలు ఆఫ్రికన్ సంతతికి చెందిన అథ్లెట్లను రంగంలోకి దించకపోతే, మన పతకాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుతం 26 మంది కాకుండా 41 మంది భారతీయ అథ్లెట్లు పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
భారతదేశం నుండి 65 మంది అథ్లెట్లు వివిధ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలో పాల్గొన్నారు. అందులో 29 మంది పతకాలతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. వీటిలో ఆరు స్వర్ణాలు, 14 రజతాలు, తొమ్మిది కాంస్యాలు ఉన్నాయి. కానీ తాము కనీసం ఏడు బంగారు పతకాలు , ఐదు రజత పతకాలను తృటిలో కోల్పోయామని అడిల్లే ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దేశాలు ఆఫ్రికన్ మూలానికి చెందిన వ్యక్తులను రంగంలోకి దించడం వల్లే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి అథ్లెట్లు పోటీలో లేని దృష్టాంతంలో.. భారత పతకాల సంఖ్య 13 స్వర్ణాలు, 19 రజతాలు , తొమ్మిది కాంస్యాలకు చేరుకుందన్నారు. అయితే ఆఫ్రికన్ సంతతికి చెందిన అథ్లెట్లు ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహించడంపై సుమరివాలా ఆందోళనను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు.
ఇక ఈ మెగా ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారతీయ అథ్లెట్లపై సుమరివాలా ప్రశంసల వర్షం కురిపించారు. ఏడుగురు అథ్లెట్లు తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేయగా.. ఐదుగురు ఈ సీజన్‌లో ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. ముగ్గురు అథ్లెట్లు జాతీయ స్థాయిలో కొత్త రికార్డులను నెలకొల్పగా.. మరో ఇద్దరు ఆసియా క్రీడల్లో రికార్డులను సృష్టించారని తెలిపారు. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు చూపిన ప్రదర్శనకు ముందు ఏఎఫ్ఐ నిర్వహించిన గ్రాస్‌రూట్ స్థాయి ప్రోగ్రామ్‌ను సుమరివాలా ప్రశంసించారు.
భారత అథ్లెట్లను లక్ష్యంగా చేసుకున్న చైనా సిబ్బంది:
చైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా భారత అథ్లెట్లను టార్గెట్ చేస్తున్నారని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంజు బాబీ జార్జ్ ఆరోపించారు. చైనా అధికారుల ఆరోపణలు, విఘాతం కలిగించే చర్యల కారణంగా చైనాలో విజయం సాధించడం భారతీయ అథ్లెట్లకు సవాలుగా మారిందని జార్జ్ నొక్కిచెప్పారు. హాంగ్‌జౌ ఆసియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అథ్లెట్లు నీరజ్ చోప్రా, కిషోర్ కుమార్ జెనా, అన్నూ రాణిలను సత్కరించే విషయంలో చైనా అధికారులు పేలవంగా వ్యవహరించారని అంజూ ఫైర్ అయ్యారు.
చైనా ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదని.. గతంలో జ్యోతితో సహా తమ అథ్లెట్లకు జరిగిందని.. నిన్న అన్నూ రాణి, జెనా, నీరజ్‌ల పట్ల ఇలాగే వ్యవహరించారని అంజూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్లే కనిపిస్తోందని.. ఆసియా క్రీడలలో ఇలాంటి సంఘటనలను చూసినందుకు తాను చాలా బాధపడ్డానని అంజూ బాబీ జార్జ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చైనా అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని ఫెడరేషన్ పరిశీలిస్తోందని ఆమె తెలిపారు.
జావెలిన్ త్రో లో నీరజ్ , జెనా, అన్నూ రాణిలు అద్భుత ప్రదర్శన చేశారని.. అయితే చైనాలో పతకాలు సాధించడంలో ఎదురయ్యే సవాళ్లను తాము ముందే ఊహించామని అంజూ తెలిపారు. తాము బాగా రాణించినప్పటికీ, వారు (చైనా అధికారులు) విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతారని ఆమె చెప్పారు.