Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ టీమ్.. పాకిస్తాన్‌ని చిత్తు చేసిన హాకీ టీమ్..

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-2 తేడాతో విజయాన్ని అందుకున్న భారత పురుషుల హాకీ జట్టు... తొలిసారి బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌కి టీమిండియా.. 

Asian Games 2023: India beats Pakistan in Hockey, Indian Badminton men's team reaches finals CRA
Author
First Published Sep 30, 2023, 8:38 PM IST | Last Updated Sep 30, 2023, 8:38 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో భారత పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఉజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 16-0 తేడాతో విజయాన్ని అందుకున్న భారత హాకీ టీమ్, సింగపూర్‌తో మ్యాచ్‌లో 16-1 తేడాతో విజయాన్ని అందుకుంది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది టీమిండియా..

ఇందులో భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించాడు. ఉదయం స్క్వార్ష్‌ పురుషుల టీమ్ ఈవెంట్‌లో 2-1 తేడాతో పాకిస్తాన్‌ని ఓడించిన భారత జట్టు, సాయంత్రం హాకీలోనూ చిత్తు చేసింది. అదే విధంగా U19 SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ పాకిస్తాన్, టీమిండియా చేతుల్లో 3-0 తేడాతో ఓడిపోయింది. 


టేబుల్ టెన్నిస్‌లో భారత మహిళల జోడి అహీకా ముఖర్జీ- సుత్రితా ముఖర్జీ సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో వరల్డ్ ఛాంపియన్స్ చైనాపై 3-1 తేడాతో విజయాన్ని అందుకుంది భారత జోడి. ఏషియన్ గేమ్స్‌ చరిత్రలో భారత టీటీ మహిళలు డబుల్స్‌లో ఇప్పటిదాకా పతకం గెలవలేదు. ఈసారి దాన్ని బ్రేక్ చేయబోతున్నారు అహీకా ముఖర్జీ- సుత్రితా ముఖర్జీ..

బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు,మొట్టమొదటిసారిగా ఫైనల్‌కి ప్రవేశించింది. కొరియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 3-2 తేడాతో విజయాన్ని అందుకుంది భారత పురుషుల బ్యాడ్మింటన్ టీమ్. మొదటి మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, తన ప్రత్యర్థి జోన్ హెవోక్ జిన్‌పై 18-21, 21-16, 21-19 తేడాతో విజయాన్ని అందుకున్నాడు. దీంతో 1-0 తేడాతో ఆరంభించింది భారత జట్టు.

అయితే రెండో మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి జోడి 13-21, 24-26 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయింది. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో లక్ష్యసేన్, 21-7, 21-9 తేడాతో సునాయాస విజయాన్ని అందుకున్నాడు. 

నాలుగో మ్యాచ్‌లో అర్జున్- ద్రువ్ కపిల 16-21, 11-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయారు. దీంతో స్కోర్లు 2-2 తేడాతో సమం అయ్యాయి. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌ని కిడాంబి శ్రీకాంత్ 12-21, 21-16, 21-18 తేడాతో సొంతం చేసుకున్నాడు. మొదటి సెట్‌లో ఓడిపోయిన తర్వాత ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చి, విజయాన్ని అందుకున్న శ్రీకాంత్, భారత బ్యాడ్మింటన్ జట్టును తొలిసారి ఫైనల్ చేర్చాడు.. రేపు చైనాతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత బ్యాడ్మింటన్ జట్టు.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios