ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టిన తెలుగు క్రీడాకారులను స్వయంగా అభినందించారు. న్యూజిలాండ్ వేదికన జరిగిన అంతర్జాతీయ ఫీల్డ్ ఆర్చరీ పోటీల్లో ఆర్.కె.సిద్దార్థరెడ్డి (17), పి.వి.సాయిశ్రీనివాస్ (9) లు విజేతలుగా నిలిచింది. ఇలా అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలను సాధించిన ఈ  యువ క్రీడాకారులు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. 

వారిద్దరు ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో ఆత్మీయంగా ముచ్చటించాడు. అంతేకాకుండా వారు సాధించిన గోల్డ్ మెడల్స్ ను పరిశీలించి స్వయంగా ఆయనే వారి మెడలో వేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని వారికి సూచించారు. ప్రభుత్వం  తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి క్రీడాకారులిద్దరికి హామీ  ఇచ్చారు. 

ఇటీవల బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో బంగారు పతకాన్ని సాధించిన తెలుగు తేజం పివి. సింధును కూడా జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్దికి తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఏపిలో చాలా మంది యువత క్రీడల్లో మంచి ప్రతిభ  కనుబరుస్తున్నారని...వారికి సౌకర్యాలు కల్పించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని జగన్ తెలిపారు.