Asianet News TeluguAsianet News Telugu

అనిల్ మునావర్.. 26 మ్యాచ్‌లను ఫిక్స్ చేసిన ఘనుడు

అల్ జజీరా ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టిన ‘‘ క్రికెట్ మ్యాచ్ ఫిక్సర్స్: ది మునావర్ ఫైల్స్’’‌ డాక్యుమెంటరీ క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. 

aneel munawar spot fixing documentary by aljazeera
Author
Dubai - United Arab Emirates, First Published Oct 22, 2018, 12:39 PM IST

అల్ జజీరా ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టిన ‘‘ క్రికెట్ మ్యాచ్ ఫిక్సర్స్: ది మునావర్ ఫైల్స్’’‌ డాక్యుమెంటరీ క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. అనిల్ మునావర్ ఇప్పటి వరకు 26 స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలను విజయవంతంగా నడిపినట్లు తెలిపిన అల్‌జజీరా..  2011-12 మధ్యకాలంలో జరిగిన ఆరు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను స్పాట్ ఫిక్సింగ్ చేయించినట్లుగా ఆదివారం రాత్రి విడుదల చేసిన డాక్యుమెంటరీలో వెల్లడించింది.

వీటిలో ఏడు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, మూడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, మరో మ్యాచ్‌లో వేరే దేశానికి చెందిన జట్టు ఆటగాళ్లకు సంబంధం ఉందని తెలిపింది. ఇక అగ్రశ్రేణి జట్లయిన భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 2011లో లార్డ్స్‌లో జరిగిన టెస్ట్, 2011లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన కేప్‌టౌన్ టెస్ట్, 2011లో ప్రపంచకప్‌లో 5 మ్యాచ్‌లు, 2012లో శ్రీలంక‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోని మూడు మ్యాచ్‌లు ఫిక్సయినట్లు డాక్యుమెంటరీ వెల్లడించింది.

అలాగే 2012లో యూఏఈ వేదికగా జరిగిన మూడు టెస్టుల్లోనూ స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆధారాలు సేకరించింది. మునావర్ ఆటగాళ్లు, బుకీలతో జరిపిన సంప్రదింపులకు సంబంధించి ఫోటోలు, ఫోన్ కాల్ సంభాషణలను అల్ జజీరా ఇన్వెస్టిగేటివ్ యూనిట్ సదరు డాక్యుమెంటరీలో పొందుపరిచింది. వీటిలో ఎక్కువ భాగంగా అహ్మద్‌బాద్‌కు చెందిన క్రికెట్ బుకీ దినేశ్ కాల్గీ.. అసిస్టెంట్ దినేశ్ కాంబాట్తో జరిపిన ఫోన్‌కాల్స్ ఉన్నాయి.

ఇందులో 2012లో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మూడు టీ20లు ఫిక్సయిన వివరాలు ఉన్నాయి.. వీటిలో ఇంగ్లాడ్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఒక ఇంగ్లాండ్ క్రికెటర్‌తో మునావర్ జరిపిన సంభాషణ కలకలం రేపింది.

‘‘ ముందుగా యాషెస్‌ సిరీస్‌కు మీకు శుభాకాంక్షలు...మీకు చెల్లించాల్సిన చివరి సెటిల్‌మెంట్ రెడీ అయ్యింది... మరో వారంలో మీ ఖాతాలో సొమ్మును జమ చేస్తాం అని మునావర్ అనగా.. అటువైపు నుంచి ‘‘లవ్లీ’’ అన్న సమాధానం వినిపించింది. అతని పేరు వెల్లడించనప్పటికీ... ఆ క్రికెటర్ 2011 క్రికెట్ వరల్డ్ కప్‌‌కు కొద్దిరోజుల ముందు జట్టులో చోటు దక్కించుకున్నాడని తెలిపింది.

దీని ఆధారంగా అల్‌జజీరా జర్నలిస్టులు సదరు క్రికెటర్‌ను కలిసి.. ఫోన్ సంభాషణను వినిపించగా.. ఇదంతా కల్పితమని ఆ క్రికెటర్ వ్యాఖ్యానించాడట. ఇదే డాక్యుమెంటరీలో పాకిస్తాన్ -ఇంగ్లాండ్ టెస్ట్ సందర్భంగా.. నిషేధిత పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్.. ‘‘డీ-కంపెనీ’’ ప్రతినిధితో దుబాయ్‌లోని హోటల్‌ లాబీలో జరిపిన సంప్రదింపుల ఫోటోలను బయటపెట్టింది.

అక్మల్‌తో డీ-కంపెనీ ప్రతినిధి ఇద్దరు ఉండగా మూడో వ్యక్తి ఫోటో తీశాడు.. ఆ సమయంలో ఒక బ్యాగును పరిశీలించిన అక్మల్.. ఆనందంతో అతనికి షేక్‌హ్యాండ్ ఇచ్చి.. బ్యాగుతో పాటు హోటల్‌ నుంచి బయటకు వచ్చిన దృశ్యాలను అల్ జజీరా ప్రసారం చేసింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అక్మల్ ఈ ఏడాది జూన్‌లో పాక్ క్రికెట్ బోర్డులోని అవినీతి నిరోధ విభాగం నుంచి నోటీసులు అందుకున్నాడు.

ఇదే డీ-కంపెనీ ప్రతినిధి హాంకాంగ్‌ సూపర్ సిక్సెస్, దక్షిణాఫ్రికాతో యూఏఈలో జరిగిన టెస్ట్ సిరీస్, 2015 ప్రపంచకప్‌ను ఫిక్స్ చేయాల్సిందిగా అక్మల్‌ను కలిశాడు. హాంకాంగ్ సూపర్ సిక్సెస్ లీగ్ సమయంలో రెండు డాట్ బాల్స్ వేసేందుకు గాను 2 లక్షల అమెరికన్ డాలర్లను తనకు ఆఫర్ చేసినట్లు అక్మల్ తెలిపాడు. అలాగే 2015 వన్డే ప్రపంచకప్ సమయంలో గ్రూప్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా తనకు బుకీల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయని అంగీకరించాడు.

డాక్యుమెంటరీ ప్రకారం అనిల్ మునావర్ 26 మ్యాచ్‌లకు గాను 25 మ్యాచ్‌లను విజయవంతంగా స్పాట్ ఫిక్సింగ్ చేశాడు. ఇతనిపై గల మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఈ ఏడాది మేలో అల్‌జజీరా మొదటి డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. మునావర్‌.. అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘‘డీ-కంపెనీ’’లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తాడు. మునావర్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలపై ఐసీసీకి ఎనిమిదేళ్ల నుంచి సమాచారం ఉన్నప్పటికీ సరైన ఆధారాలు లేని కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది.

ఈ నేపథ్యంలో అల్‌జజీరా డాక్యుమెంటరీ ఆధారంగా అతన్ని పట్టుకోవాల్సిందిగా సభ్యదేశాలను విజ్ఞప్తి చేసింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్... ఈ డాక్యుమెంటరీపై స్పందిస్తూ.. అవినీతి, క్రికెట్ బెట్టింగ్స్ విషయంలో ఐసీసీ ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. డాక్యుమెంటరీలో తెలిపిన మ్యాచ్‌లను మరోసారి పరిశీలించి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

అవినీతి విషయంలో.. క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అల్‌జజీరా తీసుకున్న చొరవను ఆయన అభినందించారు. ఫిక్సింగ్ వ్యవహారాల్లో ఆ ఛానెల్‌తో కలిసి పనిచేస్తామని మార్షల్ స్పష్టం చేశారు. కాగా, కొద్దిరోజుల క్రితం జరిగిన ఆసియా కప్ సందర్భంగా.. స్టింగ్ ఆపరేషన్లకు సంబంధించిన ‘‘రా ఫుటేజ్‌ను అల్‌జజీరా ఛానెల్ తమతో పంచుకోవడంలో లేదని..ఎడిటింగ్ చేసిన ఫుటేజీని మాత్రమే అందజేస్తోందని మార్షల్ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ ఏడాది మేలో అల్ జజీరా ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ వాస్తవాలు ఎన్నో బయటకు వచ్చాయి. గాలెలో గతేడాది శ్రీలంక-భారత్ టెస్టు మ్యాచ్ లో పిచ్ ఫిక్సింగ్ ను బయటపెట్టిన అల్ జజీరా ఛానెల్.. మరో రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరిగినట్టు తెలిపింది. రెండేళ్లుగా టీమిండియా ఆడిన ఈ మూడు టెస్టులు ఫిక్స్ అయినట్లు అల్ జజీరా వీడియో ఫుటేజ్ ని బయటపెట్టింది.

క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్ పేరిట 54 నిమిషాల డాక్యుమెంటరీని సోషల్ మీడియా, యూ-ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది అల్ జజీరా.  పిచ్ స్వభావాన్ని మార్చడంతో పాటు టెస్టుల్లో వివిధ సెషన్లపై ఫిక్సర్లు పందెం కాశారని.. భారీ మొత్తం డబ్బు చేతులు మారిందని వివరించింది.

ఇందులో పాకిస్తాన్ టెస్ట్ ప్లేయర్ హసన్ రాజా, శ్రీలంక ఆటగాళ్లు దిల్హరా లోకుహెటిగే, జీవంత కులతుంగ, తరిందు మెండిస్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు అల్ జజీరా స్టింగ్ ఆపరేషన్ లో తేలింది. వీళ్లతోపాటు పిచ్ క్యూరేటర్ దయానంద వర్ణవీరతో పిచ్ తయారు చేయించడంలో కీలక పాత్ర పోషించారని అల్ జజీరా తెలిపింది. ఫిక్సింగ్ ప్రాసెస్ లో ఇండియన్ ప్లేయర్లకి ఎలాంటి సంబంధం లేదని తేల్చింది అల్ జజీరా.

Follow Us:
Download App:
  • android
  • ios