న్యూఢిల్లీ:  వన్డే క్రికెట్ లో అదరగొడుతున్న అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు ఆయన లేఖ రాశాడు. 

హైదరాబాద్‌కు ఆడిన ప్రతీ క్షణాన్ని తాను ఆస్వాదించినట్టు చెప్పాడు. హెచ్‌సీఏ నుంచి తనకు అందించిన సహకారం, సహచర ఆటగాళ్ల మద్దతును తాను మరిచిపోలేనని చెప్పాడు. ఇకపై తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను ఆడాలనుకోవడం లేదని అన్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు, దేశవాళీ టోర్నీల్లో వన్డేలు మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఈ ఆకస్మిక నిర్ణయంతో టెస్ట్ ఫార్మాట్‌కు కూడా రాయుడు వీడ్కోలు చెప్పినట్టు అయింది. 2013-14లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ రాయుడు రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. 

ఆ తర్వాత రాయుడికి టెస్టు జట్టులో చోటు దక్కలేదు. వన్డే జట్టులోకి అప్పుడప్పుడూ వచ్చి పోతున్న రాయుడికి విండీస్ సిరీస్ కలిసి వచ్చింది. నాలుగో స్థానంలో వచ్చి నిలకడగా ఆడుతూ జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఇకపై రాయుడు వన్డే క్రికెట్ కే పరిమితమవుతాడని అర్థమవుతోంది.