క్రికెటర్ అంబటి రాయుడుని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రిటైర్మెంట్ చేసినట్లే చేసి... మళ్లీ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అంబటి భారత షాహిద్ ఆఫ్రిది అంటూ ఎగతాళి చేస్తున్నారు.

రెండేళ్లు నిలకడగా టీమిండియాకు ఆడిన రాయుడిని సెలక్టర్లు ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు. మూడు కోణాల్లో అవసరం అవుతాడని ఐదు మ్యాచ్‌లు కూడా ఆడని విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. భావోద్వేగం చెందిన రాయుడు ప్రపంచకప్‌ వీక్షించేందుకు ‘3డీ’ కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని సెటైర్‌ విసిరాడు.

రాయుడు, పంత్‌కు చోటివ్వకపోవడంతో విమర్శలు రావడంతో వారిని బ్యాకప్‌ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. శిఖర్ ధావన్‌కు గాయం అవ్వడంతో పంత్‌ను ఇంగ్లాండ్‌ పిలిపించారు. సాధనలో బుమ్రా విసిరిన యార్కర్‌ తగిలి గాయపడ్డ విజయ్‌ శంకర్‌ స్థానంలో అంబటి రాయుడిని ఎంపిక చేయొచ్చని అంతా భావించారు. సెలక్టర్లు మయాంక్‌ అగర్వాల్‌ను పిలిపించడంతో  అతడు భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. తాజాగా అతడు వీడ్కోలు ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టు రాయుడు ప్రకటించాడు. దీంతో ట్విటర్లో కొందరు సెటైర్లు వేస్తున్నారు.