Asianet News TeluguAsianet News Telugu

రెజ్లర్ల పోరాటానికి పెరుగుతున్న మద్దతు.. మహిళా అథ్లెట్ల భద్రత ముఖ్యమన్న హర్యానా సీఎం

WFI: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తో పాటు  జాతీయ కోచ్ లు తమను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ  ప్రముఖ  రెజ్లర్ వినేశ్ పోగట్ చేసిన ఆరోపణలు  క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. 

All the issues raised by the athletes will be taken seriously, Says Haryana CM Manohar lal Khattar MSV
Author
First Published Jan 19, 2023, 4:33 PM IST

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా  రెజ్లర్లు చేపట్టిన  ఆందోళనకు క్రీడా రంగం నుంచే గాక  రాజకీయ ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తున్నది.   గురువారం  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద  ఆందోళనకు దిగిన వారికి  నేడు బీజేపీ నేత, రెజ్లర్ బబితా పోగట్  తో పాటు ఆమె సోదరి గీతా పోగట్ మద్దతు తెలిపారు.  హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా వారికి అండగా నిలిచారు.  

జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన   రెజ్లర్ల  పోరాటానికి మద్దతుగా  హర్యానా సీఎం  ఖట్టర్ మాట్లాడుతూ.. ‘మన మహిళా అథ్లెట్ల  భద్రత  అత్యంత ప్రాధాన్యం. దీనిని మేం  చాలా  తీవ్రంగా పరిగణించాలి. మేము వాళ్ల మనోధైర్యాన్ని వమ్ము కానివ్వం. రెజ్లర్లు లేవనెత్తిన ప్రతీ సమస్యపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే...’ అని  తెలిపారు. 

2010లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ గా నిలిచిన గీత పోగట్.. రెజ్లర్ల పోరాటానికి మద్దతు తెలిపింది.  ట్విటర్ వేదికగా ఆమె   స్పందిస్తూ.. ‘మనదేశపు  రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐలో ఏం జరుగుతందనేదానే వాస్తవాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. నిజం కోసం పోరాడుతున్న వాళ్లకు  మద్దతు ఇవ్వడం వారికి న్యాయం చేయడం  మన దేశ ప్రజలందరి కర్తవ్యం..’ అని   ట్వీట్ చేసింది. 

గీత సోదరి బబిత ట్వీట్  చేస్తూ..  ‘ఈ విషయంలో నేను నా తోటి రెజ్లర్లకు అండగా ఉంటా. ఈ సమస్యలను ప్రతి స్థాయిలో ప్రభుత్వంతో లేవనెత్తడానికి నేను కృషి చేస్తాను.  భవిష్యత్ బాగుంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను...’అని   పేర్కొంది.  బబితా.. నేడు   ధర్నా ప్రాంతానికి వచ్చి వారితో మాట్లాడింది.  వీరితో పాటు ప్రతిపక్ష రాజకీయ నాయకులు కూడా  రెజ్లర్ల పోరాటానికి మద్దతు తెలిపారు. 

 

కాగా వినేశ్ పోగట్ లేవనెత్తిన అంశాలపై  కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. రెజ్లర్ల  శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దీనిని సీరియస్ గా తీసుకుంది.  రెజ్లర్ల ఆరోపణలపై  మూడు రోజుల్లోగా (72 గంటలు)  వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐని  ఆదేశించింది.   ‘రెజ్లర్ల శ్రేయస్సుకు సంబంధించిన అంశం కాబట్టి క్రీడా మంత్రిత్వ శాఖ  ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.  ఈ విషయంలో డబ్ల్యూఎఫ్ఐ  72 గంటల్లోగా వివరణ ఇవ్వాలి.  లేకుంటే  2011, నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్  నిబంధనల ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది..’అని  పేర్కొంది.  ఇదిలాఉండగా లైంగిక వేధింపుల ఆరోపణలపై  దర్యాప్తు చేసేందుకు గాను  ముగ్గురు సభ్యుల కమిటీతో కూడిన  ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర  యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios