National Games: ఏడేండ్ల తర్వాత దేశంలో క్రీడా పండుగ.. నేటి నుంచే 36వ జాతీయ క్రీడలు.. ప్రారంభించనున్న మోడీ
National Games 2022: దేశంలో వేలాది క్రీడాకారులు సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న తరుణం రానేవచ్చింది. ఏడేండ్ల తర్వాత దేశంలో మళ్లీ జాతీయ క్రీడలు జరుగబోతున్నాయి. నేటి సాయంత్రం గుజరాత్ లో ప్రధాని మోడీ.. వీటిని అధికారికంగా ప్రారంభిస్తారు.
దేశంలో క్రీడాభిమానులు, క్రీడాకారులు ఎదురుచూపులకు తెరపడనుంది. ఏడేండ్ల తర్వాత దేశంలో జాతీయ క్రీడలు జరుగనున్నాయి. 2015లో కేరళలో నిర్వహించిన జాతీయ క్రీడల తర్వాత మళ్లీ వీటిని నిర్వహించలేదు. దీంతో సుదీర్ఘకాలం తర్వాత దేశంలో జరుగబోయే జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యమిస్తున్నది. నేటి సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మాదాబాద్‌లో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించనున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఇప్పటికే గుజరాత్ చేరుకున్న ఆయన.. సాయంత్ర జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని క్రీడలను ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తారు.
ప్రస్తుతం జరుగుతున్నవి 36వ జాతీయ క్రీడలు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు గుజరాత్ లోని ఆరు నగరాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి సుమారు 7వేల మంది అథ్లెట్లు ఈ క్రీడలలో పాల్గొనన్నారు. ఆర్మీ, సర్వీసెస్ ల ఆటగాళ్ల క్రీడా విన్యాసాలు క్రీడాభిమానులను అబ్బురపరుచనున్నాయి.
ఏడేండ్ల తర్వాత..
రెండేండ్లకోసారి జరిగే జాతీయ క్రీడలు చివరిసారి 2015లో (35వ) కేరళలో జరిగాయి. అప్పుడు సర్వీసెస్ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వాస్తవానికి ఆ తర్వాత 2016లో గోవా 36వ జాతీయ క్రీడలు జరగాల్సి ఉంది. కానీ లాజిస్టిక్స్ సమస్య వల్ల ఆ ఏడాది వీటిని నిర్వహించలేదు. ఆ తర్వాత వరుసగా పలు కారణాల వల్ల ఇవి వాయిదా పడుకుంటూ వస్తూనే ఉన్నాయి. 2020లో నిర్వహిద్దామని అనుకునేసరికి కరోనా దేశంలో అల్లకల్లోలం సృష్టించడంతో మళ్లీ వాయిదాపడ్డాయి. ఎట్టకేలకు ఈ ఏడాది గుజరాత్ ఆతిథ్య హక్కులను దక్కించుకుని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది.
ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే..
భారత్ లో జాతీయ క్రీడలు తొలిసారిగా 1924లో జరిగాయి. అప్పటికి అవిభాజ్య భారతదేశంలోని లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్) లో వీటిని నిర్వహించారు. అప్పుడు వీటిని ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ అని పిలిచేవారు. వరుసగా మూడు పర్యాయాలు (1928 వరకు) లాహోర్ లో వీటిని నిర్వహించారు. 1930లో అహ్మదాబాద్ వీటికి ఆతిథ్యమిచ్చింది. 1940 నుంచి వీటి పేరు మారింది. ఆ ఏడాది నుంచి వీటిని నేషనల్ గేమ్స్ అని పిలిచారు. స్వతంత్ర్య భారతదేశంలో తొలిసారి జాతీయ క్రీడలు జరిగింది 1948 లక్నోలో.
1985 లో ఈ క్రీడలలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జోక్యంతో గతంతో పోల్చితే ప్రజాధరణ తగ్గింది. దీంతో వీక్షకుల సంఖ్యను పెంచడానికి గాను ఒలింపిక్స్ తరహాలో వీటిని నిర్వహించాలని నిర్ణయించారు. అప్పట్నుంచి ఈ గేమ్స్ లో 5వేలకు మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. క్రీడలు, క్రీడాంశాల జాబితా
పునరుద్దరించబడిన తర్వాత 1985లో మహారాష్ట్ర అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2007 వరకు మహారాష్ట్ర, కేరళ లు ఆధిపత్యం చెలాయించిన ఈ క్రీడలలో 2007 నుంచి సర్వీసెస్ ఆధిక్యం స్పష్టంగా కొనసాగుతున్నది. వరుసగా మూడు పర్యాయాలు (2007, 2011, 2015లలో) సర్వీసెస్ విజేతగా నిలిచింది.
36వ జాతీయ క్రీడల గురించి..
- సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరుగుతాయి.
- 28 రాష్ట్రాల నుంచి 7 వేలకు పైగా అథ్లెట్లు పాల్గొంటారు.
- గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీ నగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ లలో జరుగుతాయి. ఒకే వేదికలో కాకుండా ఆరు నగరాల్లో జాతీయ క్రీడలను నిర్వహించడం ఇదే తొలిసారి.
- 36 క్రీడాంశాలున్నాయి.
ఇలా చూడొచ్చు..
- 36వ జాతీయ క్రీడలను డీడీ స్పోర్ట్స్, ప్రసారభారతి యూట్యూబ్ ఛానెళ్లలో చూడొచ్చు.