క్రీడాకారులను వదిలేసి ఎగిరిపోయిన ఎయిరిండియా.. బాధితుల్లో స్వర్ణపతక విజేత

భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి  వివాదంలో ఇరుక్కుంది. ఏడుగురు టేబుల్ టెన్నిస్ క్రీడాకారులను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం ఎక్కించుకోకుండా వదిలి వెళ్లిపోవడం వివాదానికి కారణమైంది

Air India leaves national TT squad at Delhi Airport

భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి  వివాదంలో ఇరుక్కుంది. ఏడుగురు టేబుల్ టెన్నిస్ క్రీడాకారులను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం ఎక్కించుకోకుండా వదిలి వెళ్లిపోవడం వివాదానికి కారణమైంది. ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు భారత్ నుంచి 17మంది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు, అధికారుల బృందం ఆదివారం మెల్‌బోర్న్‌కు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

అయితే సదరు విమానం ఓవర్ బుకింగ్ అయ్యిందంటూ వీరిలో 10 మందిని మాత్రమే ఫ్లైట్‌లోకి ఎక్కించుకుని మిగిలిన ఏడుగురిని ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలి వెళ్లిపోయింది. బాధితుల్లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్, కామన్‌వెల్త్ గేమ్స్ స్వర్ణపతక విజేత మనికా బత్రా కూడా ఉన్నారు. తన బృందానికి జరిగిన అవమానంపై వెంటనే ఆమె ట్విట్టర్ ద్వారా కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్, పీఎంవోల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు..

‘‘ నాతో పాటు మరో ఏడుగురిని ఎయిరిండియా విమానం ఏఐ 0308 ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలి వెళ్లిపోయిందని.. అందువల్ల తాము టోర్నీకి వెళ్లలేకపోతున్నామంటూ’’ బత్రా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా తాము క్రీడలను, క్రీడాకారులను గౌరవిస్తామని. అయితే క్రీడాకారుల బృందం వేరు వేరు పీఎన్ఆర్‌ల కింద బుక్ చేసుకున్నారని.. వీటిలో కొన్ని ఓవర్‌బుక్ అయ్యాయని.. అంతేకాకుండా క్రీడాకారుల్లో కొందరు ఆలస్యంగా వచ్చారని వివరణ ఇచ్చింది.

ఫ్లైట్ మిస్సయిన వారందరికి వసతి కల్పించామని.. వీరిని సోమవారం మెల్‌బోర్న్‌కు పంపుతామని  స్పష్టం చేసింది. కాగా, జరిగిన ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఇఫ్ ఇండియా శాఖా పరమైన విచారణకు ఆదేశించింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios