Pakistan : ఘోర అవమానం.. హోటల్ బిల్లులు కట్టలేక గిన్నెలు కడిగిన పాకిస్థాన్ ఆటగాళ్లు
Pakistan Hockey Players Wash Dishes : ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ హాకీ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. నిధుల కొరతతో హోటల్ బిల్లులు చెల్లించలేక ఆటగాళ్లు కిచెన్ క్లీన్ చేస్తూ, గిన్నెలు కడిగిన వైనం క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

పాకిస్థాన్ పరువు గంగలో.. హోటల్ బిల్లులు కట్టలేక ఆటగాళ్లతో వెట్టిచాకిరీ!
పాకిస్థాన్ పరువు గంగలో పాయే.. హోటల్ బిల్లులు కట్టలేక ఆటగాళ్లతో గిన్నెలు కడిగారు. పాకిస్థాన్ హాకీ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత అవమానకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జాతీయ హాకీ జట్టు క్రీడాకారులు మైదానంలో స్టిక్కులతో విన్యాసాలు చేయాల్సింది పోయి, హోటల్ గదుల్లో కిచెన్ క్లీన్ చేస్తూ, గిన్నెలు కడగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ జట్టు కెప్టెన్ అమ్మద్ షకీల్ బట్ మీడియా ముందు వెల్లడించడంతో ప్రపంచ క్రీడా రంగంపై పాకిస్థాన్ పరువు మరోసారి మంటగలిసింది.
కెప్టెన్ అమ్మద్ షకీల్ బట్ ఆగ్రహం
బుధవారం ఉదయం లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్న పాకిస్థాన్ హాకీ జట్టు సభ్యులు తమ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాలను తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కెప్టెన్ అమ్మద్ షకీల్ బట్.. ప్రస్తుత పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHF) మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "ఈ యాజమాన్యం కింద మేం ఇక పని చేయలేం. ఒక మ్యాచ్ ఆడటానికి వెళ్లే ముందు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు కిచెన్ క్లీన్ చేస్తూ, గిన్నెలు కడగాల్సి వస్తే.. ఆ జట్టు నుండి మీరు ఎలాంటి ఫలితాలను ఆశిస్తారు?" అని ఆయన నిలదీశారు. క్రీడాకారులకు కనీస గౌరవం లేని చోట ఆడటం తమ వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు.
విమానాశ్రయంలో పడిగాపులు.. రోడ్లపై తిప్పలు
ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం నుండే తీవ్ర సమస్యలతో సాగింది. జట్టు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత దాదాపు 12 నుండి 13 గంటల పాటు అక్కడే చిక్కుకుపోయింది. ఎటువంటి సమాచారం ఇచ్చే వారు లేక, తదుపరి ప్రయాణానికి ఏర్పాట్లు లేక ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుండి కాన్‌బెర్రా చేరుకున్నాక పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ముందస్తుగా బుక్ చేసిన హోటల్ బిల్లులు ఫెడరేషన్ చెల్లించకపోవడంతో బుకింగ్స్ రద్దయ్యాయి. దీంతో క్రీడాకారులు తమ లగేజీతో రోడ్లపై తిరగాల్సి వచ్చింది. చివరకు ఒక ఏర్‌బీఎన్‌బీ లో 13 రోజుల పర్యటనకు గాను కేవలం 10 రోజులు మాత్రమే బస కల్పించారు. ఆ తర్వాత పర్యటన మధ్యలో అత్యంత చవకైన, సౌకర్యాలు లేని గదుల్లోకి వారిని తరలించారు.
Pakistan hockey players crying on live TV saying they haven’t received daily allowances since 2023.
Just a few days ago in Australia they were reportedly asked to leave a hotel over unpaid bills.
When a country spends more on Terrorism then sports and players are the first to… pic.twitter.com/uH3eErsKo4— Ravi Ranjan Singh 🇮🇳 (@RaviRanjanIn) February 18, 2026
నిధుల గోల్‌మాల్.. నిలదీసిన పాక్ క్రీడా బోర్డు
ఈ వ్యవహారంపై పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్ (PSB) స్పందించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఆటగాళ్ల హోటల్ ఖర్చుల కోసం తాము ఇప్పటికే 10 మిలియన్ రూపాయల (భారత కరెన్సీలో సుమారు ₹30,30,000) నిధులను విడుదల చేశామని బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, ఆ డబ్బు ఏమైంది? ఆటగాళ్ల వరకు ఎందుకు చేరలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఫెడరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే అంతర్జాతీయంగా దేశం తలదించుకోవాల్సి వచ్చిందని పాక్ పౌరులు, అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
బెదిరింపులు.. క్రీడాకారుల ఆవేదన
జట్టు పడుతున్న ఇబ్బందులను బయటి ప్రపంచానికి చెబితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మేనేజ్‌మెంట్ తమను బెదిరించినట్లు కెప్టెన్ బట్ ఆరోపించారు. "మా జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు, కానీ మాకు సరైన కోచ్, మేనేజ్‌మెంట్ అవసరం. ఆస్ట్రేలియాలో మేం అనుభవించిన నరకం వల్లే నేను ఇప్పుడు గొంతు విప్పుతున్నాను. జట్టు పురోగతి సాధించాలంటే విదేశీ కోచ్‌ను నియమించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. మేనేజ్‌మెంట్ వైఫల్యం వల్ల ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతిన్నదని, అందుకే ఆస్ట్రేలియా, జర్మనీతో జరిగిన మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిష్ఠ కోల్పోతున్న పాక్ హాకీ
ఒకప్పుడు హాకీలో ప్రపంచ ఛాంపియన్‌గా వెలిగిపోయిన పాకిస్థాన్.. ఇప్పుడు కనీసం హోటల్ బిల్లులు కట్టలేని స్థితికి పడిపోవడం గమనార్హం. ఈ పర్యటనలో పాకిస్థాన్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఆటగాళ్లు మానసికంగా కుంగిపోయి ఉండటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు గిన్నెలు కడిగారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని పాక్ క్రీడా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

