ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలి : పి. చిదంబరం ఆసక్తికర ట్వీట్
భారత క్రీడారంగానికి సంబంధించి కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం ఆసక్తికర ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం ఆదివారం రాత్రి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన నలుగురు ఫైనలిస్టుల నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఫైనల్ కు చేరిన నలుగురు టెన్నిస్ క్రీడాకారులు ఆడంబరాలకు పోకుండా చాలా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తారని.. భారత్‌లో కూడా అది అలవరుచుకోవాలని ఆయన సూచించారు.
ఆదివారం రాత్రి పదిగంటలకు ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘రోలండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్)టెన్నిస్ టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన నలుగురు ఫైనలిస్టులు పోలాండ్, చెక్ రిపబ్లిక్, సెర్బియా, నార్వే ల నుంచి ప్రాతినిథ్యం వహించారు.
పైన పేర్కొన్న అన్ని దేశాలు వారి దేశాలలో సమస్యలు, బలాలు, బలహీనతలతో సతమతమవుతున్నా చాలా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తాయి. ఆ దేశాల లీడర్స్ కూడా నిరాడంబరంగా ఉంటారు. గొప్పలకు పోరు. వాళ్ల క్రీడల్లో రాజకీయ, ప్రభుత్వ జోక్యం ఉండదు. ఒకవేళ వాళ్లకు క్రీడా మంత్రి ఉన్నా ఆయన తెర వెనకాలే ఉంటాడు. ఇండియా వంటి దేశాలకు ఇవొక మంచి పాఠాలు..’అని ట్వీట్ లో పేర్కొన్నారు.
అయితే చిదంబరం ఏ క్రీడను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారన్నది స్పష్టంగా తెలియనప్పటికీ భారత్ లో ప్రస్తుతానికైతే రెండు క్రీడల గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా టీమిండియా.. ఆసీస్ చేతిలో దారుణంగా ఓడింది. భారత క్రికెటర్లకు ఇక్కడ భారీ ఫాలోయింగ్ ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి 11వ నెంబర్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ వరకూ అందరూ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నవారే. ఈ ఓటమి అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది.
ఇదిగాక గడిచిన రెండు నెలలుగా దేశరాజధానిలో రెజ్లర్ల పోరాటం సాగుతోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ కొంతకాలంగా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్నా రెజ్లర్లకు ఇంకా న్యాయం దక్కలేదు. మరి చిదంబరం చేసిన ఈ ట్వీట్ ఎవరి గురించోనని క్రీడా, రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది.