మరో మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ కైవసం

అప్ఘానిస్థాన్ జట్టు అరుదైన ఆటతీరుతో దూసుకుపోతోంది. డెహ్రాడూన్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. అప్ఘాన్ సూపర్ బౌలర్ రషీద్ ఖాన్ మరోసారి తన సత్తా చాటి జట్టుకు మరో విజయాన్ని అందించాడు. 

 మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్ లో అప్ఘానిస్థాన్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి మూడు మ్యాచ్ ల సీరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 

మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను అప్ఘాన్ బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో బంగ్లా 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అద్భుత ఫామ్ లో ఉన్న అప్ఘాన్ బౌలర్ రషీద్‌ ఖాన్‌ (4-0-12-4) తన స్పిన్‌ మాయతో బంగ్లా బ్యాటింగ్ లైనప్ ని కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇతడికి తోడు మహమ్మద్‌ నబీ కూడా తన ఆల్ రౌండ్ ప్రతిభతో అదరగొట్టాడు. ఇతడు బౌలింగ్ లో 2 వికెట్లు తీయడమే కాకుండా లక్ష్యచేదనలో కేవలం 15 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

లక్ష్యఛేదనలో అఫ్ఘాన్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 135 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.