మెడ గాయం కారణంగా కౌంటీ క్రికెట్‌కు దూరమైన విరాట్ కోహ్లిని వెనకేసుకొచ్చాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి.  కోహ్లీ మెషిన్ కాదని.. అందరిలాంటి మనిషేనని.. అతనికీ కాస్త రెస్ట్ కావాలని  రవిశాస్త్రి అన్నాడు. కౌంటీల్లో సర్రీ టీమ్‌తో నెల రోజుల పాటు ఆడటానికి కోహ్లి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా మూడు వన్డేలు, మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

అయితే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతని మెడకు గాయమైంది. అయినా రాజస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆడాడు. ఇంగ్లండ్ టూర్‌కు ముందు సర్రీ టీమ్‌కు ఆడటం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని విరాట్ భావించాడు. కానీ సడెన్‌గా ఈ గాయంతో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అయితే అతను టాప్ ప్లేయర్ అయినంత మాత్రాన అతని వెనుక రాకెట్ ఇంధనాన్ని నింపి గ్రౌండ్‌లో విడిచిపెట్టలేం కదా అని రవిశాస్త్రి అన్నాడు.

ఏడాది కాలంగా కోహ్లి విపరీతమైన క్రికెట్ ఆడుతున్నాడు. 12 నెలల కాలంలో 9 టెస్టులు, 30 వన్డేలు, 9 టీ20లు, ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. కోహ్లి వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూసిన సర్రీ టీమ్.. ఇప్పుడు అతను రావడం లేదని తెలిసి అసంతృప్తి వ్యక్తంచేసింది. అయితే క్రికెటర్లకు గాయాలు సహజమని, బీసీసీఐ మెడికల్ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని సర్రీ టీమ్ డైరెక్టర్ అలెక్ స్టీవార్ట్ అన్నాడు.