లాభనష్టాలు, గెలుపోటముల ప్రసక్తి లేనిది కేవలం ఆ రంగమే: డా.యం.ఎన్.చార్య
మనం ఈ లోకంలోకి ఎందుకొచ్చామని ప్రశ్నించుకుంటే- ఎవరినుంచీ ఏ మార్గంలోనూ సమాధానం దొరకదు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మనం ఈ లోకంలోకి ఎందుకొచ్చామని ప్రశ్నించుకుంటే- ఎవరినుంచీ ఏ మార్గంలోనూ సమాధానం దొరకదు... ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ఫ జీవితం రూపంలో లభ్యమైన ఇంత అమూల్యమైన ప్రయాణాన్ని ఇంత అర్థంలేని, ఇంత చవిలేని, ఇంత నిరర్థకమైన గమ్యం కోసమే చేశామని అర్థమై, వచ్చిన దారివైపు, ఆ చివర మొదలు పెట్టిన స్థానంవైపు చూస్తే- ఎంత అనాలోచితంగా, ఇంత అలవోకగా చేశామేమిటని... మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడతాం.
ఒక పనిని లేదా కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు తగినదాన్ని ఎన్నుకునే అవకాశం చాలావరకు మనకుంది. అల్లాటప్పా పని కాకుండా అమూల్యమైనదాన్ని, మన శ్రమకు తగిన ఫలితం ఇవ్వగలిగేదాన్ని ఎన్నుకోవాలి. మానవ జన్మ మనం ఎన్నుకున్నది కాకపోయినా (నిజానికి లోతుగా ఆలోచిస్తే అది మనం ఎన్నుకున్నదే. కర్మ ఫలాల ఫలితంగా)- దాన్ని ఎలా జీవించాలనే విషయం, దేనికి ఉపయోగించుకోవాలనే విషయం, నిర్ణయం మన మేధా పరిధిలోనే ఉంది. అంత మంచి వెసులుబాటును మనం సవ్యంగా వినియోగించుకోలేకపోతే మనకంటే మూర్ఖులు మరెవరూ ఉండరు.
ఈ లోకంలో లాభనష్టాలు, గెలుపోటముల ప్రసక్తి లేనిది కేవలం ఆధ్యాత్మిక రంగం మాత్రమే. ఒకే ఒక సంకల్పం, ఏకసూత్రం... స్వస్థానాన్ని, శాశ్వత ధామాన్ని చేరుకోవడం. పరమాత్మ పాదాల చెంత నిర్వికల్ప విశ్రాంతిని, శాశ్వత ఉపశాంతిని పొందడం. మార్గం ఒకటే అయినా మార్గమధ్యాన్ని నిరాటంకం, కంటకరహితం చేసుకోవలసి ఉంది. మలుపులు, మారు మార్గాంతరాలు లేకపోయినా మన మనసు చేసిన మార్గ నిర్దేశాన్ని అనుసరిస్తూనే మన అడుగు వేయబోయే మన ముందరి భాగాన్ని ప్రయాణ సౌలభ్యంగా మలచుకోవలసి ఉంది. దాని ఉద్దేశం- రేపటి ప్రయాణికులకు సానుకూలం చేయడం కూడా అయిఉండాలి. ప్రతి మానవ ప్రయత్నానికీ అందరి శ్రేయస్సు కూడా లక్ష్యమై ఉండాలి. ఇదే మానవ జీవన ప్రయాణ ఉద్దేశం, భగవన్నిర్దేశం కూడా.
ఒక మహావృక్షం నాజూకు తీగల అల్లికను ఆహ్వానిస్తుంది. పూలు పూయనిస్తుంది. ఒక చీమల పుట్ట పాముల వసతికి అంగీకరిస్తుంది. ఒక కాకి కోకిల పిల్లకు పొత్తిలి పరుస్తుంది. ప్రకృతి సదా సర్వదా ‘పరోపకార ప్రకృతి’తోనే తన ఉనికిని పరిపూర్ణం చేసుకుంటుంది... అదీ అత్యంత సహజంగా. మనిషి ఎందుకు అసహజ జీవనాన్ని ఎన్నుకున్నాడు? అనుక్షణం ప్రకృతితోనే జీవిస్తూ, ప్రకృతి సహకారాన్నే పొందుతూ ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఏకమాత్రంగా, ఏకసూత్రంగా, కళ్లు మూసుకుని ఆ అంధకార సహకారంతో తానొక్కడినే అనే భ్రమను తనకు తానే కల్పించుకుని స్వార్థంతో జీవిస్తున్నాడు.
నిజానికి తాను ఆత్మనని తెలుసుకునేవరకు- తాను ఒక్కడు కాదు, అనేకం, అనేకానేకం. తాను ఆత్మనని గ్రహించిన క్షణమైతే... ప్రతి అణువూ తానే. శ్రీరామకృష్ణులు అలాంటి ఆత్మభావంతో లయమైనప్పుడే పరమహంస కాగలిగారు. అయితే ముందుగా అనేకత్వాన్ని అంగీకరించి సాధనా పూర్వక క్రమ పరిణామంలో, అనేకత్వాన్ని ఏకత్వ స్థాయిలోకి మలచుకున్నప్పుడు, మమేకమైనప్పుడు మాత్రమే అటువంటి అనుభూతి, పరివర్తన, స్థితి... సుసాధ్యం!