భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త తనకు అన్యాయం జరిగిందని బాధపడలేదు. అలా అని భార్యను దూరం పెట్టలేదు. కేవలం తన కాపురాన్ని నాశనం చేసిన వ్యక్తికి కోర్టు ద్వారా బుద్ధి చెప్పాడు. అతని వద్ద నుంచి రూ.5కోట్లు పరిహారంగా రాబట్టాడు. ఈ సంఘటన దక్షిణ కరోలీనాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నార్త్ కరోలినాకు చెందిన కెవిన్ అనే  ఓ వ్యక్తికి ... 12ఏళ్ల క్రితం వివాహమయ్యింది. దశాబ్దకాలంపాటు భార్య తననతో ప్రేమగా ఉండేది. అలాంటి ఆమెలో కొంతకాలంగా మార్పు రావడాన్ని కెవిన్ గుర్తించాడు. తనను సరిగా పట్టించుకోవడం మానేసింది. ఆఫీసు పనిలో బిజీగా ఉందేమో అందుకే పట్టించుకోలేదని భ్రమపడ్డాడు.

సడెన్ గా తనకు కెవిన్ నచ్చడం లేదంటూ కోర్టుకి ఎక్కింది. కెవిన్ భార్య అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఎప్పుడూ పనిలో మునిగిపోయే కెవిన్..తనను సరిగా పట్టించుకోవట్లేదని విడాకుల సందర్భంగా ఆమె పేర్కొంది. దీంతో కెవిన్ షాకయ్యాడు. అయితే... భార్య ఇష్టాన్ని గౌరవించి ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే... భార్య అలా విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కారణం తెలుసుకోవాలని భావించాడు.

అయితే అసలు సమస్య ఎక్కడుందో తేల్చాలనుకున్న కెవిన్.. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సహాయం తీసుకున్నాడు. కెవిన్ కాపురం కూలిపోవడానికి భార్య సహోద్యోగి కారణమని ఆ డిటెక్టివ్ కనిపెట్టాడు. గత కొంత కాలంగా కెవిన్ భార్య అతడితో వివాహేతర సంబంధం నెరపుతోందని కెవిన్‌కు చెప్పాడు. 

దీంతో భార్య సహోద్యోగిపై కెవిన్ స్థానిక కోర్టులో ఓ ప్రత్యేకమైన చట్టం(ఏలియనేషన్ ఆఫ్ ఎఫెక్షన్) కింద కేసు వేశాడు. ఇది 1800 సంవత్సరం నాటి చట్టం. అమెరికాలో కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం..మూడో వ్యక్తి కారణంగా తన కాపురం కూలిపోయిందని భావించిన వారు.. సదరు వ్యక్తిపై కోర్టులో కేసు వేయవచ్చు.

 కాగా, ఈ కేసును విచారించిన కోర్టు.. సహోద్యోగిదే తప్పని తేల్చింది. వారి కాపురంలో చిచ్చు పెట్టినందుకు అతడు కెవిన్‌కు 750,000 డాలర్లు(5 కోట్ల రూపాయలు)చెల్లించాలంటూ తీర్పిచ్చింది. కాగా,  వివాహం ప్రవిత్రతను తెలియజెప్పేందుకు తాను కేసు వేసినట్టు కెవిన్ ఈ సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.