బరువు ఎక్కువున్న పిల్లలకు గుండె జబ్బులు, ఆస్తమా, డయాబెటీస్ వంటి రోగాలొస్తయ్.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 38.2 మిలియన్ల పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరి వయస్సు 5 సంవత్సరాల కంటే తక్కువ. బరువు ఎక్కువున్న పిల్లలకు డయాబెటీస్, ఆస్తమా వంటి ఎన్నో రోగాలొచ్చే అవకాశం ఉంది. పిల్లలు సురక్షితంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందేనంటున్నారు నిపుణులు.
వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల శరీరంలో ఎన్నో శారీరక మార్పులు వస్తాయి. ఇవి సర్వ సాధారణం. కానీ ఆ మార్పులను తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు బాగా బరువు పెరిగిపోతుంటారు. దీనివల్ల వారు క్యూట్ గా కనిపించినా.. అది ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. పిల్లలకు పెట్టే ఫుడ్ సరిగ్గా లేనప్పుడే వారు విపరీతంగా బరువు పెరిగిపోతారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధన ప్రకారం.. ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. స్థూలకాయులైన పిల్లలకు ఆస్తమా, కీళ్ల సమస్యలు, ఎముకల సమస్యలు, స్లీప్ అప్నియా, గుండె జబ్బులు, డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది. వీటితో పాటుగా క్యాన్సర్, స్ట్రోక్, అకాల మరణంతో పాటుగా మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని చిట్కాలతో పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. అదెలా ఇప్పుడు చూద్దాం..
ఆరోగ్యకరమైన ఆహారాల అలవాటు
పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఫాస్ట్ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు. కానీ ఫాస్ట్ ఫుడ్ ను తినడం వల్ల సర్వ రోగాలు వస్తాయి. దీన్ని తింటే ఊబకాయం బారిన పడతారు. అందుకే పిల్లలను ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంచండి. ఆరోగ్యకరమైన ఆహారాలనే అలవాటు చేయండి.
ఒకేసారి తినండి
ఈ రోజుల్లో చాలా మందికి టీవీ చూస్తూ లేదా ఫోన్ ను చూస్తూ తినే అలవాటు ఉంది. కానీ దీనివల్ల పిల్లలు అతిగా తింటారు. బెడ్, సోఫాలపై కాకుండా డైనింగ్ టేబుల్ పై అందరూ కలిసి తినడం అలవాటు చేసుకోండి. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని భోజనాన్ని చేసే పిల్లలు అతిగా తినే అవకాశం చాలా తక్కువ.
శారీరక శ్రమ
ప్రస్తుతం పిల్లల ఆటలు మారాయి. ఒకప్పుడు ఫ్రెండ్స్ తో ఆరుబయట ఆడుకునే వాళ్లు. ఇప్పుడు ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు. కానీ బాడీ కదలకుండా ఉంటే శరీరంలో కేలరీలు కరగవు. దీంతో పిల్లల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. దీనివల్ల చిన్న వయసులోనే బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే పిల్లలు స్క్రీన్ ను చూసే టైం ను తగ్గించండి. ఆరు బయట గేమ్స్ ఆడేలా చూడండి.
ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యకరమైన ఆహారం పిల్లలు బరువు పెరగకుండా చూస్తుంది. అందుకే పిల్లలకు పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా పెట్టండి. ఇవి ఎక్కువగా తినని పిల్లలే తొందరగా జబ్బుల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాలనే పెట్టండి.
తీపి, కారం ఉండే ఆహారాలను పెట్టకండి
తీపి పదార్థాలు కూడా బరువును పెంచుతాయి. ఎందుకంటే చక్కెరలో కేలరీలు ఎక్కువకగా ఉంటాయి. ఇది పిల్లల బరువును అమాంతం పెంచుతుంది. ఇకపోతే స్పైసీ ఫుడ్ వల్ల ఎసిడిటీ తో పాటుగా కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి వాటికి మీ పిల్లలను దూరంగా ఉంచండి. వీటికి బదులుగా ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన మిల్క్ షేక్ ను ఇవ్వండి.