దంపతులు పెళ్లైన కొంతకాలం వరకు తమ మధ్యలోకి పిల్లలు రాకుండా ఉంటే బాగుండని కోరుకుంటారు. అందుకోసం జాగ్రత్తలు తీసుకుంటారు. రెండు సంవత్సరాల తర్వాతో, మూడు సంవత్సరాల తర్వాతో... పిల్లలు కావాలని అనిపిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా.. పిల్లలు మాత్ర కలగరు. దీంతో... వాళ్లు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగడం మొదలుపెడతారు.

నిజానికి ఎలాంటి గర్భ నిరోధక విధానాలు అవలంబించకుండా సంవత్సరం పాటు కాపురం చేసినా... పిల్లలు కలగడం లేదు అంటే సమస్య ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య తలెత్తితే ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు డాక్టర్లు పరిశీలించి.. ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో చెక్ చేసి... అందుకు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు.

అయితే...ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇద్దరిలోనూ సమస్య ఉండటం లేదు. కానీ వాళ్లకు పిల్లలు మాత్రం పుట్టడం లేదని తెలుస్తోంది. దీనిని ‘ అన్ ఎక్స్ ఫ్లెయిన్డ్ ఫెర్టిలిటీ’ సమస్యగా గుర్తిస్తారు. దీని అర్థం ఏమిటంటే... దంపతులు ఇద్దరిలో విడివిడిగా పిల్లలను కనే సామర్థ్యం ఉంది. కానీ... వారిద్దరికీ కలిపి పిల్లలను కనే అవకాశం లేదు. 

డీఎన్ఏ డ్యామేజీనే దీనికి  కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఉండేది కాదు. కానీ... ఇప్పుడు దీనికి కూడా సరైన ట్రీట్మెంట్ ని కనిపెట్టేశారు. కాబట్టి... ఇలాంటి సమస్య మీకు ఎదురైతే ముందుగానే సరైన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఇక పురుషుల్లో లోపం విషయానికి వస్తే... వారిలో వీర్యకణాల సంఖ్య సరిపోను ఉండాలి. అంతేకాకుండా వాటి క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. ఒక్క స్ఖలనంలో కనీసం 20 మిలియన్ల వీర్యకణాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సగం వీర్య కణాలు మార్ఫాలజీ సహజంగా ఉండాలి. వీర్యకణాల ఆకారంలోనూ లోపాలు ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వీర్య కణంలో తల, మధ్యభాగం, తోక ఉంటుంది. ఈ మూడింట్లో ఏ ఒక్కదాంట్లో లోపం ఉన్నా పిల్లలు పుట్టే అవకాశం ఉండదని చెబుతున్నారు. తల భాగంలో ఏదైనా సమస్య ఉంటే అది అండంలోకి సరిగ్గా చొచ్చుకుపోలేదు. మధ్యభాగంలో లోపం ఉంటే అండంలోకి పూర్తిగా చేరుకోలేదు. ఒకవేళ తోకలోనే లోపం ఉంటే అండం దాకా వీర్యకణం ఈదలేదు. ఇలాంటి సమస్య వీర్యకణాల్లో ఉంటే... సంఖ్య 20 మిలియన్లు ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు.

ఇక పిల్లలను ఏ వయసులోపు కనాలి అనే విషయంపై కూడా చాలా మంది దంపతుల్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందిలే అని ఫీలౌతుంటారు. అయితే.... స్త్రీల గర్భదారణకు అనువైన వయసు 24ఏళ్ల నుంచి 30ఏళ్లు అని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్ల వరకు గర్భం దాల్చే అవకాశం ఉన్నప్పటికీ... 30వ సంవత్సరంలో పెళ్లైతే ఆరు నెలలలోపే గర్భం దాల్చే ప్రయత్నం చేయాలి.

అదేంటి..? 35ఏళ్లు దాటిన తర్వాత కూడా పిల్లలను కనేవాళ్లను మేము చాలా మందిని చూశామని... వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారని చాలా మంది అనుకోవచ్చు. అది నిజమే. అయితే... దాని వల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 30ఏళ్ల తర్వాత పిల్లలను కంటే.. వారికి శారీరకంగా, మానసికంగా ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

అంతేకాదు... పురుషుల్లో కూడా కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పురుషుల్లో 35 సంవత్సరాలు నిండితే.. వారి వీర్యంలోని నాణ్యత పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. దీని వల్ల కూడా సంతానలేమి సమస్యలు వస్తాయి. కాబట్టి.... వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పిల్లలను కనే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.