మరో ప్రతిష్టాత్మక క్రీడా పోరాటానికి హైదరాబాద్ నగరం వేదికయ్యింది. ఎన్నో రకాల క్రీడా పోటీలకు ఆతిథ్యమిచ్చిన గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు ప్రజల క్రీడగా పేరొందిన కబడ్డి పోటీలు జరగనున్నాయి. ప్రో కబడ్డి లీగ్ పేరుతో ప్రతి ఏడాది   వివిధ రాష్ట్రాల పేరుతో ఈ క్రీడా సమరం  జరిగే విషయం తెలిసిందే. అలా ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకోగా... ప్రో కబడ్డి సీజన్-7 ఇవాళ(శనివారం) ప్రారంభంకానుంది.

తెలుగు టైటాన్స్ Vs యూ మంబా బలాబలాలివే

ఈ లీగ్ ఆరంభ మ్యాచ్ స్థానిక జట్టయిన  తెలుగు టైటాన్స్, మరో ఛాంపియన్ జట్టు యూ ముంబాతో తలపడుతోంది. ఇరు జట్లు  దేశీయ ఆటగాళ్లతో పాటు  ఇరానీ ఆటగాళ్లను కలిగి చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే గతేడాది యూ ముంబా తరపున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రైడర్ సిద్దార్థ్ దేశాయ్ ఈసారి తెలుగు టైటాన్స్ జట్టులో చేరాడు. అతడు ఈ సీజన్లో కూడా రాణిస్తాడన్న నమ్మకాన్ని యాజమాన్య, తెలుగు అభిమానులు కలిగివున్నారు. అభిమానులు ముద్దుగా బాహుబలి అని పిలుచుకునే సిద్దార్థ్ గత సీజన్లో అత్యధిక పాయింట్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతడు 218 రైడ్ పాయింట్స్ తో అగ్రస్థానంలో నిలిచాడు. 

ఇలా గతంతో పోలిస్తే యూ ముంబా కంటే తెలుగు టైటాన్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. అంతేకాకుండా హోమ్ టౌన్ లో సొంత అభిమానుల మధ్య ఈ మ్యాచ్ ఆడటం టైటాన్స్ జట్టుకు మరింత బలాన్నివ్వనుంది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు కూడా సిద్దమయ్యారు. 

బెంగళూరు  బుల్స్ Vs పాట్నా పైరేట్స్ 

ఇదే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోనే మరో మ్యాచ్ కూడా ఇవాళే జరగనుంది. గతేడాది జరిగిన సీజన్-6 లో విజేతగా నిలిచిన బెంగళూరు బుల్స్ తో మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన పాట్నా  పైరేట్స్ తలపడనుంది. బెంగళూరు జట్టు పవన్ షెరావత్ పై, పాట్నా జట్టు ప్రశాంత్ నర్వాల్ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వీరు ఈ సీజన్లో తమ అభిమానులు పెట్టుకున్న ఆశలను ఏ మేరకు నెరవేరుస్తారో చూడాలి  మరి. 


20-07-2019(శనివారం) మ్యాచెస్ షెడ్యూల్: 

ఫస్ట్ మ్యాచ్: 

తెలుగు టైటాన్స్ Vs యూ ముంబా 
(టైమ్ 7.30pm)

సెకండ్ మ్యాచ్:

బెంగళూరు బుల్స్ Vs పాట్నా పైరేట్స్ 
(టైమ్ 8.30pm)
 

సంబంధిత వార్తలు

ప్రో కబడ్డి సీజన్-7: లే పంగా... తెలుగు టైటాన్స్ కు వీరే కొండంత బలం

లే పంగా....హుస్సెన్ సాగర్ లో ప్రో కబడ్డి సీజన్-7 లోగో ఆవిష్కరణ