ఐపిఎల్, ప్రపంచ కప్ వంటి ప్రధాన క్రికెట్ టోర్నమెంట్స్ ముగిసింది. ఇన్నాళ్లు క్రికెట్ మజాను ఆస్వాదించిన అభిమానులు ఇకనుండి దేశీయ క్రీడ కబడ్డీని ఆస్వాదించనున్నారు. అయితే మన కబడ్డికి యధావిదిగా కాకుండా కాస్త కార్పోరేట్ హంగులు పులిమి మరింత ఆకట్టుకునేలా తయారుచేసిన మెగా టోర్నీయే  ప్రో కబడ్డి లీగ్.

ఈ ప్రో కబడ్డి లీగ్ సీజన్-7 ఆరంభ మ్యాచ్ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా తెలుగు టైటాన్స్ జట్టు హుస్సేన్ సాగర్ జలాశయం వద్ద సందడి చేశారు. ట్యాంక్ బండ్ పై జరిగిన కార్యక్రమంలో యువ హీరో సందీప్ కిషన్ తెలుగు జట్టు ఆటగాళ్లను పరిచయం  చేశారు. 

అనంతరం ప్రో కబడ్డి సీజన్-7 లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగి విచ్చేసిన సందీప్ కిషనే ఈ లోగో ఆవిష్కరణ కూడా చేపట్టాడు. ప్రత్యేకంగా హుస్సెన్ సాగర్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఆ లోగో వీక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. విద్యుత్ కాంతుల మద్య బుద్దుడు విగ్రహం  పక్కనే ఈ లోగో ఆకర్షణీయంగా వుంది. 

ఈ లోగో ఆవిష్కరణ అనంతరం హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ...కబడ్డి అంటే తనకెంతో ఇష్టమని అన్నాడు. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి సరదాగా కబడ్డి ఆడేవాడినని  గుర్తుచేసుకున్నాడు. అయితే ఈ  ప్రో కబడ్డి కాస్త కార్పోరేట్ స్టైల్లో వున్నా పక్కా లోకల్ క్రీడేనని తెలిపాడు. ప్రతి  సీజన్ ను తాను మిస్సవకుండా చూస్తుంటానని...ఈ ప్రో కబడ్డి సీజన్ 7 ను కూడా టీవిలో, వీలుంటే ప్రత్యక్షంగా వీక్షిస్తానని సందీప్ కిషన్ వెల్లడించాడు.