పవన్ పెళ్లిళ్లపై జగన్ వ్యాఖ్యలు: పబ్లిగ్గా నిలబడితే...
ఎవడి ప్రైవేట్ బతుకు వాడి వాడి సొంతం... పబ్లిక్ గా నిలబడితే ఏమైనా అంటాం - శ్రీశ్రీ. మహా కవి శ్రీశ్రీ మాటలు పవన్ కల్యాణ్ కే కాదు, వైఎస్ జగన్ కు కూడా వర్తిస్తాయి.
విజయవాడ: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బహుశా అవసరం లేకపోయి ఉండవచ్చు. వేరే రాష్ట్ర వ్యవహారాలపై ఆయన వ్యాఖ్యలు చేయడం అనుచితమే కావచ్చు. కానీ, ఆయన మాటను అలా అని కొట్టిపారేయలేం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని అన్నారు. తాజా సంఘటనను చూస్తే అలా అనుకోక తప్పదు. సమస్యలపై పోరాటాలు కాస్తా వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లాయి.
ప్రత్యేక హోదా, విభజన హామీలు ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ అంశాల మీదనే కేంద్ర ప్రభుత్వంపై సమరం సాగిస్తున్నారు. అలా సాగిస్తూనే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై కాస్తా దూకుడుగాను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాస్తా మెతగ్గానూ విమర్శలు చేస్తున్నారు. వారిద్దరు బిజెపితో కుమ్మక్కయి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జగన్ ను అవినీతి కేసుల్లో దోషిగా కూడా అభివర్ణిస్తున్నారు.
నిజానికి, జగన్ కేసుల్లో ఇప్పటి వరకు నిందితుడిగానే ఉన్నాడు. కేసులు నిరూపితమై, శిక్ష పడేవరకు ఆయనను దోషిగా వ్యాఖ్యానించడానికి కుదరదు. కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను బహిరంగంగానే దోషిగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువగా కాకున్నా తక్కువగానైనా తప్పు పడుతూనే ఉన్నారు. ఈ స్థితిలో పవన్ కల్యాణ్, జగన్ కలిసి పనిచేస్తారనే ప్రచారం కూడా సాగింది. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని జగన్ స్పష్టంగానే చెబుతూ పవన్ కల్యాణ్ తో పొత్తు ఉండదనే సంకేతాలను పంపించారు. కానీ, పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వలేదు.
రాజకీయాలు ప్రత్యేక హోదా, విభజన హామీలపై సాగుతుండగా జగన్ తన వ్యాఖ్యల ద్వారా ఎజెండాను మార్చేశారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. బహుభార్యాత్వంగా ఆయన అభివర్ణించారు. అంటే పాలిగమీ అన్నారు. అది పాలిగమీ కిందికి వస్తుందా అనేది ఇంతకు ముందు పెళ్లి చేసుకున్నవారికి పవన్ కల్యాణ్ చట్టబద్దంగా విడాకులు ఇచ్చారా, లేదా అనే విషయంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మనలనైతే బొక్కలో తోసేవారని జగన్ మరో వ్యాఖ్యను జోడించారు. అంటే, పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మిత్రుడు కాబట్టి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆ పనిచేయడం లేదని ఆయన చెప్పదలుచుకున్నారు.
జగన్ వ్యాఖ్యలపై జనసేన నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా ఇతర పార్టీల నాయకులు కూడా మండిపడుతున్నారు. చర్చ కాస్తా ప్రత్యేక హోదా, విభజన హామీల నుంచి పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల వైపు మళ్లింది. అలా చేయడంలో జగన్ వ్యూహం కూడా ఉండవచ్చునని అంటున్నారు. కేంద్రంపై, బిజెపిపై పోరాటం చేస్తూ చంద్రబాబు పైచేయి సాధించే అవకాశాలను దెబ్బ తీయాలనే వ్యూహంలో భాగంగా జగన్ ఆ పని చేసి ఉంటాడని భావిస్తున్నారు.
వచ్చే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమరాన్ని తనకూ పవన్ కల్యాణ్ కు మధ్య మార్చడానికి జగన్ ఆ పనిచేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కేంద్రంపై, బిజెపిపై చేస్తున్న పోరాటానికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. తద్వారా తనకు కొంత వెసులుబాటు లభిస్తుందని జగన్ భావించి ఉండవచ్చు.
దానికితోడు, పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో తన శక్తియుక్తులను కేంద్రీకరించారు. జగన్ పాదయాత్ర త్వరలో ఉత్తరాంధ్రలోకి ప్రవేశించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ పెడుతున్న కృషి ప్రభావం తన పాదయాత్రపై పడుతుందని ఆయన భావించి ఉండవచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి ముందస్తుగానే వ్యూహరచన చేసి పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసి ఉంటారని అనుకుంటున్నారు.
ఎవడి ప్రైవేట్ బతుకు వాడి వాడి సొంతం... పబ్లిక్ గా నిలబడితే ఏమైనా అంటాం - శ్రీశ్రీ
మహా కవి శ్రీశ్రీ మాటలు పవన్ కల్యాణ్ కే కాదు, వైఎస్ జగన్ కు కూడా వర్తిస్తాయి.
- కె. నిశాంత్
(ఈ వ్యాస రచయిత అభిప్రాయాలతో ఏసియా నెట్ న్యూస్ తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. భిన్నాభిప్రాయాలకు ఇక్కడ చోటు ఉంటుంది. తమ అభిప్రాయాలను పంచుకోవాలనుకునేవారు ఈ కింద మెయిల్ కు తమ వ్యాసాలను పంపించవచ్చు. pratapreddy@asianetnews.in)