Asianet News TeluguAsianet News Telugu

Whatsapp Scandal: స్పైవేర్ అంటే ఏమిటి, వాట్సాప్‌ను తీసేస్తే మీ ఫోన్ సేఫేనా! ?

ప్రియాంక గాంధీ ఫోన్ కూడా హ్యాక్ అవ్వడంతో భారతదేశంలో కూడా పెగసస్ స్పైవేర్ కు సంబంధించి ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు ఈ పెగాసస్  అంటే ఏమిటి, ఇది ఎలా ఫోనుల్లోకి ఎంటరయ్యి ఎలా ఫోన్ ని తన ఆధీనంలోకి తీసుకుంటుందో తెలుసుకుందాం. 

whatsapp scandal: not just cyber espionage, its beyond that
Author
New Delhi, First Published Nov 6, 2019, 5:14 PM IST

ఢిల్లీ కాలుష్యం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఏర్పడ్డ సందిగ్ధత అన్ని వెరసి ఒక ముఖ్యమైన విషయంపైనుంచి మన దృష్టిని మరల్చాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆర్టీసీ సమ్మె, నిన్నటి తహసీల్దార్ విజయ హత్యోదంతం,ఇసుక కొరత నేపథ్యంలో హాట్ గా మారిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అదనపు ఆకర్షణలు. 

ఇంతకు అంత పెద్ద విషయం ఏమిటంటే వాట్సాప్ హ్యాకింగ్ ఉదంతం. ఇదేదో కేవలం భారత దేశానికి మాత్రమే సంబంధించిన ఉదంతం కాదు. మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశం. వాట్సాప్ మాతృ సంస్థయిన పేస్ బుక్ ఈ స్పైవేర్ ను తయారు చేసిన ఇజ్రాయెలీ కంపెనీపై అమెరికాలో కేసు దాఖలు చేసింది. 

ఈ నేపథ్యంలో అసలు ఈ స్పైవేర్ ఏమిటి,ఎవరు తయారు చేసారు, ప్రపంచంలో ఎవరెవరికి దీన్ని అమ్మారు, ఈ స్పైవేర్ ఫోనుల్లోకి ఎలా చొరబడుతుంది,ఆ తరువాత ఏమవుతుంది అనే అన్ని ప్రశ్నలకు కూలంకషంగా సమాధానాలు తెలుసుకుందాం. 

అసలు కేసు ఏమిటి?

వాట్సాప్ మాతృసంస్థైన పేస్ బుక్ అమెరికాలో ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థపైన కేసు దాఖలు చేసింది. ఈ సదరు సంస్థ ప్రజల ఫోన్లలోకి వాట్సాప్ ద్వారా చొరబడే ఒక స్పైవేర్ ను తాయారు చేసారని ఆరోపించింది. 

ఈ కేసు దాఖలు చేసే ముందు వాట్సాప్ సంస్థకు ఈ విషయమై ఒక సమాచారం అందింది. అందగానే ప్రపంచంలోనే కొందరు మేటి హ్యాకర్లను పిలిపించి ఈ విషయమై శోధన ఆరంభించింది.(సమాచారం వాట్సాప్ కు ఎలా అందిందనేది కింద కూలంకషంగా తెలుసుకుందాము)

Also read: whatsapp scandal : ప్రియాంకా గాంధీ వాట్సాప్‌ హ్యాక్

సిటిజెన్ ల్యాబ్ అనే సంస్థ ఈ శోధన మొదలుపెట్టింది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 1400మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు తేల్చింది. సదరు 1400మందికి ఈ సమాచారాన్ని కూడా చేరవేసింది. 

తొలుత భారత దేశంలో బయటపడ్డ పేర్లను చూస్తే చాలామంది లెఫ్ట్ ఐడియాలజీ సానుభూతిపరులో లేక వారితోనే సన్నిహిత సంబంధం కలిగినవారుగానో తేలింది. వీరంతా భీమా కోరేగావ్ ఉదంతంతోటి సంబంధమున్న వ్యక్తులవడం గమనార్హం. 

ఇప్పుడు తాజాగా ప్రియాంక గాంధీ ఫోన్ కూడా హ్యాక్ అయినట్టు తెలుపడంతో ఇదేదో మెగా స్కాండల్ కు దారితీసే విధంగా కనపడుతుంది. ప్రస్తుతానికి లెక్క 1400 ఉన్నా, వాస్తవానికి ఈ సంఖ్యా ఇంకా చాలా ఎక్కువ ఉండే ఆస్కారముంది. 

ఏమిటి ఈ పెగసస్ స్పైవేర్...   

ఈ పెగసస్ అనేది గ్రీకు పురాణాల్లో మనకు కనపడే ఒక రెక్కల గుర్రం. దీనిపైన బెలెరోఫోన్ అనే యోధుడు ఒక బల్లెం పట్టుకొని మనకు కనపడతాడు ఇలా తన చేతిలోని బల్లాన్ని ఇంగ్లీషులో స్పియర్ అంటారు. స్పియర్ పేరు మీదనే ఈ సదరు స్పైవేర్ ద్వారా చేసే ఫిషింగ్ కి స్పియర్ ఫిషింగ్  అని పేరు పెట్టడం జరిగింది. 

whatsapp scandal: not just cyber espionage, its beyond that 

ఇక దీన్ని తయారు చేసిన కంపెనీ విషయానికి వస్తే ఎన్ఎస్ఓ అనే ఒక ఇజ్రాయిల్ సంస్థ ఈ స్పైవేర్ తయారుచేసింది. ప్రపంచంలో శాంతి భద్రతలను కాపాడడానికి, తీవ్రవాదం నుంచి సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్లుగా ఆ సదరు కంపెనీ తమ వెబ్సైట్లో పేర్కొంటుంది.కేవలం ప్రభుత్వాలు లేదా ప్రభ్హుత్వా నిఘా సంస్థలకు మాత్రమే తాము స్పైవేర్లను అమ్ముతామని కూడా వారు అందులో పొందుపరిచారు.  

Also read: Video: WhatsApp Scandal: దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు

ఇజ్రాయిల్ నిఘా వర్గానికి చెందిన యూనిట్ 8200 లో పనిచేసిన కొందరు అధికారులు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా సిగ్నల్ ఇంటలిజెన్స్ విభాగానికి చెందినవారు.  2012లో ఈ సదరు కంపెనీ మెక్సికో ప్రభుత్వంతో తొలి కాంట్రాక్టును చేయడం జరిగింది. 20 మిలియన్ డాలర్లకు ఈ స్పైవేర్ ను అమ్మారు. దాని తరువాత పనామా ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలోని అనేక దేశాలకు వీరు తాము తయారు చేసినటువంటి స్పైవేర్ ను అమ్ముతూ వచ్చారు. 

సౌదీ ప్రభుత్వం ఈ స్పైవేర్ ద్వారా జమాల్ ఖషోగ్గి పై నిఘా ఉంచింది. కాషోగి హత్యానంతరం ఎన్ఎస్ఓ కంపెనీ సౌదీ ప్రభుత్వం తోటి తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీనికి ఒక బలమైన కారణం ఉంది.  సౌదీకి చెందినటువంటి అహ్మద్ మన్సూర్ అనే సామాజిక కార్యకర్త వాట్సాప్ సంస్థకు ఒక ఫిర్యాదు చేశాడు.  

ఎవరో తన పైన గూఢచర్యం చేస్తున్నట్టు, తన ఫోన్ ద్వారా తన విషయాలన్నీ తెలుసుకుంటున్న అనుమానాలున్నాయని వాట్సాప్ కు తెలిపాడు. మన్సూర్ ఇచ్చిన ఫిర్యాదుతో వాట్సాప్ సిటిజన్ ల్యాబ్ అనే సంస్థను రంగంలోకి దింపి దీనిపైన పూర్తి విచారణ జరపాలని ఆదేశించింది. అలా తొలిసారి ఈ పెగసస్ స్పైవేర్ గురించి ప్రపంచానికి తెలిసింది.  

స్పైవేర్ ఏమేం పనులు చేయగలుగుతుంది అంటే కేవలం మన కాల్స్, మెసేజ్ లు వినడం, చదవడం మాత్రమే కాకుండా, పూర్తి ఫోన్ ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మన ప్రమేయం లేకుండా మన ఫోన్ని స్విచ్ ఆన్ చేయడం కానీ స్విచ్ ఆఫ్ చేయడం కానీ చేస్తుంది. అంతే కాకుండా దానికి ఇష్టం వచ్చినప్పుడు మైక్రోఫోన్ ని గాని కెమెరాని గాని ఆన్ చేయగలుగుతుంది. ఈ స్పైవేర్ కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే కాకుండా, మిస్డ్ కాల్ ద్వారా కూడా ఫోన్ లోకి చొరబడే ప్రమాదం ఉంది. 

ఈ కంపెనీ పైన అమెరికాలో వాట్సాప్ సంస్థ అనేక చట్టాల కింద కేసులు ఫైల్ చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా కంప్యూటర్ ఫ్రాడ్ అబ్యూజ్ యాక్ట్ కింద కూడా కేసులు ఫైల్ చేసింది. ఇది చాలా కఠినమైన చట్టం. ఈ చట్టం కింద ఎటువంటి శిక్ష పడుతుందో వేచిచూడాలి. 

Also read: హైదరాబాద్: స్పై వెర్ దాడులతో వాట్సాప్ కు హాని

ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది ఒక డిఫెన్స్ కంపెనీ అని వారే స్వయంగా చెప్పారు. ఈ స్పైవేర్ ని ఒక ఆయుధంగా పేర్కొన్నారు.  దానితోటి పాటు ఈ సదరు కంపెనీ ఈ స్పైవేర్ ను కేవలం ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అమ్ముతుంది. 

ఇలా ఏవైనా ఆయుధాలను ఇతర దేశాలకు అమ్మాలి అంటే సదరు దేశ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఈ  ఎన్ఎస్ఓ ఇజ్రాయిల్ కు చెందినటువంటి కంపెనీ కాబట్టి ఏదైనా దేశానికి అమ్మాలి అంటే కచ్చితంగా ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. కేవలం ప్రభుత్వ సంస్థలకు మాత్రమే తమ  స్పైవేర్ ని అమ్ముతామని చెబుతున్నారు. 

భారతదేశంలో లో తొలుతగా దీన్ని ఎవరు తీసుకువచ్చారు? ఏ సంస్థకు వారు అమ్మారు? అనే విషయాలు తేలాల్సి ఉంది. మొదటగా ఇలా హ్యాకింగ్ కు గురయ్యారని బయటికి వచ్చిన పేర్లలో ఉన్నవారంతా బీమా కోరేగావ్ ఉదంతానికి సంబంధించినటువంటి వారు . కాబట్టి ఇది ఏదో మహారాష్ట్ర ఏటీఎస్ పనయ్యుంటుందని భావించారు. కాకపోతే అందులో ఇప్పుడు ప్రియాంక గాంధీ పేరు కూడా ఉండడంతో ఇది పెద్ద చర్చకు దారితీసింది. 

ఇలా ఫోన్ల హ్యాకింగ్ కు సంబంధించి  వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ ను ఆదేశించింది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి భారత దేశంలో ప్రజాస్వామ్య విలువలనూ, రాజకీయ వ్యవస్థను, అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల వ్యక్తిగత గోప్యతను కాపాడాల్సిన అవసరం ఉంది.  

ప్రభుత్వం అనుమానం వచ్చిన కొద్దిమంది వ్యక్తుల వ్యక్తిగత వివరాలను సేకరించడం తప్పుకాదు. అది జాతీయ భద్రత కారణాల కోసం అయితే అది తప్పనిసరి కూడా. కాకపోతే అలా ఒక వ్యక్తి మీద గూఢచర్యం చేయడానికి కచ్చితంగా ఒక ప్రాసెస్ మాత్రం ఫాలో కావలసి ఉంటుంది. కనుక చట్టపరమైన విధివిధానాలను పాటించకుండా ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం భారత రాజ్యాంగ విలువలకు నీళ్లొదలడమే!

Follow Us:
Download App:
  • android
  • ios