తెలంగాణ చీఫ్ సెక్రటరీ గా సోమేశ్ కుమార్ నియామకం జరిగినప్పటినుంచీ అందరూ ఇదే విషయాన్నీ గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. సాధారణంగా కొత్త సీఎస్ గురించి అంతపెద్ద చర్చ జరగదు. కానీ సోమేశ్ కుమార్ విషయంలో మాత్రం చర్చ చాలా బలంగా జరుగుతుంది. దానికి అనేక కారాణుల్లాయి. 

సాధారణంగా సీనియర్ అధికారిని చీఫ్ సెక్రటరీ గా నియమిస్తారు. కానీ దానికి భిన్నంగా అజయ్ మిశ్ర కన్నా జూనియర్ అయిన సోమేశ్ కుమార్ ని సీఎస్ గా నియమించడంతో సర్వత్రా చర్చకు కారణమైంది. 

అజయ్ మిశ్రా 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి కాగా, సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సోమేశ్ కుమార్ కన్నా దాదాపు 5 సంవత్సరాల సీనియర్ అయిన అజయ్ మిశ్రాను సైతం పక్కకుపెట్టి ఇలా సీఎస్ పదవిని కట్టబెట్టటం ఇక్కడ చర్చకు దారితీస్తుంది. 

Also read: తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?: రేసులో వీరే...

ఇక సోమేశ్ కుమార్ అంశం ఇంతలా చర్చనీయాంశం కావడానికి మరో కారణం కూడా ఉంది. వాస్తవానికి సోమేశ్ కుమార్ ది ఆంధ్రప్రదేశ్ క్యాడర్. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కి కేటాయించారు. కాకపోతే ఈయన తెలంగాణలోనే ఉండేందుకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. అక్కడ పూర్తి స్థాయిలో ఇతనికి అనుకూలనిర్ణయం రానప్పటికీ... తెలంగాణాలో కొనసాగేందుకు మధ్యంతర ఉత్తర్వులను తెచుకోగలిగారు. 

అలా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి చెందిన ఐఏఎస్ అధికారి ఇలా తెలంగాణ రాష్ట్రంలో సీఎస్ గా ఎంపికవడం ఇక్కడ మరో చర్చకు కూడా దారి తీసింది. ఈ అన్ని పరిణామాలను గమనిస్తే, ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది. కెసిఆర్ కు సోమేశ్ కుమార్ అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడనే విషయం మాత్రం తేటతెల్లం. 

 ఈ నేపథ్యంలోనే కెసిఆర్ కు సోమేశ్ కుమార్ ఎందుకంత విశ్వాసపాత్రుడిగా మారాడు అనే కోణంలో అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఠక్కున గుర్తొచ్చే అంశమేదన్నా ఉందంటే అది చంద్రబాబు ఇంటి నిర్మాణం విషయంలో సోమేశ్ కుమార్ వ్యవహరించిన తీరు. 

తెలంగాణలో కీలకమైన జీహెచ్ఎంసీ కమిషనర్ పోస్టులో చాలా కాలం పాటు పనిచేసిన సోమేశ్ కుమార్ అప్పట్లో కేసీఆర్ ఆదేశాలమేరకు పనిచేసేవారినే ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని కట్టుకున్న సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న సోమేశ్ కుమార్ అప్పట్లో చంద్రబాబును చాలా చికాకు పెట్టారు అని అంటారు. 

Also read: కేసీఆర్ కు అత్యంత విధేయుడు: తెలంగాణ కొత్త సీఎస్ ఈయనే

చంద్రబాబు ఇంటికి అనుమతులు ఇచ్చే విషయంలో తనదైన శైలి నిర్ణయాలతో చాలానే తలనొప్పులు తెచ్చిపెట్టారట. చిన్నకారణం దొరికినాసరే దాన్ని చూపి కూడా చంద్రబాబు కొత్త ఇంటికి అనుమతులు జారీచేయకుండా సోమేశ్ కుమార్  సతాయించారన్న వాదనలూ లేకపోలేదు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే నాడు ఏపీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సోమేశ్ కుమార్ వెనుకాడలేదన్న వార్తలు అప్పట్లో సంచలం సృష్టించాయి. కేసీఆర్ చెప్పినట్లుగా నడవడం కారణంగానే కేసీఆర్ కు సోమేశ్ కుమార్ అత్యంత ప్రీతిపాత్రమైన అధికారిగా పేరు తెచ్చుకున్నట్టు సమాచారం. 

అంతే కాకుండా కజిహెచ్ఎంసీ కమీషనర్ గా ఉన్నప్పుడు ఆయన 5 రూపాయలకే భోజనం పథకాన్ని ప్రవేశపెట్టారు. కొత్త రెవిన్యూ చట్టాన్ని కూడా చాలా సమర్థవంతంగా నిర్వర్తించారు. జీఎస్టీ అమలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి రాష్ట్రంలో పన్నులద్వారా రాబడిని పెంచారు.  

ఇక ఇప్పుడు సోమేశ్ కుమార్ కంటే సీనియర్ అయిన అజయ్ మిశ్రా ను కూడా పక్కనపెట్టి కేసీఆర్, ఇలా తనకు అనుకూలంగా ఉంటారన్న కారణంగానే సోమేశ్ కుమార్ ను సీఎస్ పోస్టుకు ఎంపిక చేసినట్టు మనకు అర్థమవుతుంది. గతంలో జరిగిన పరిణామాలను పోల్చి చూసుకున్నా, మనకు అదే విషయం అవగతమవుతుంది.