కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేర్చుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో నాగేందర్ కర్ర తీసుకుని ఆందోళనకారులను తరిమిన ఫొటోను పోస్టు చేసి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. 

తలసాని శ్రీనివాస యాదవ్ తో మొదలైన తెలంగాణ ఉద్యమ వ్యతిరేకుల చేర్పు దానం నాగేందర్ దాకా వచ్చింది. దాంతో ఆగుతుందని కూడా చెప్పలేం. కేసీఆర్ స్పష్టంగానే చెప్పారు. మనకే సరిగా అర్థం కావడం లేదు. బంగారు తెలంగాణ కోసం రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలని ఆయన చెప్పారు. 

తెలంగాణ ఉద్యమ కాలంలో వ్యతిరేకిస్తే వ్యతిరేకించారు గానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆయన ఇతర పార్టీల నుంచి కండువాలు కప్పి మరీ పార్టీలోకి నాయకులను ఆహ్వానిస్తున్నారు. బలమైన నాయకులు ప్రతిపక్షాల్లో ఉండకూడదనే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆ ఆపరేషన్ చేపట్టారు.

అధికారం చేపట్టిన మరుక్షణం నుంచీ ఆయన చేస్తున్న పని అదే. అయితే, చాలా మంది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా పనిచేసినవారిని పార్టీలోకి ఆహ్వానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వారంతా బాధతోనే ఆ ప్రశ్న వేస్తున్నారని అనుకోవాలి. కానీ, అందులో కొంత అమాయకత్వం కూడా ఉంది. తెరాసను ఇంకా ఉద్యమ పార్టీ అని, కేసీఆర్ ను ఉద్యమ నేత అని నమ్మడమే ఆ అమాయకత్వం.

తెరాస ఫక్తు సాధారణ రాజకీయ పార్టీగా మారిపోయిందనే విషయాన్ని మింగలేకపోతున్నారు. కానీ, వాస్తవాలను అంగీకరించక తప్పదు. కేసీఆర్ అయితే, పక్కా ప్లాన్ తోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసమని గుండు గుత్తగా పనిచేసినవారు (వారు ఎంత కష్టపడినా సరే, ఉద్యోగాలు, పదవులు కోల్పోయి పనిచేసినా సరే) ఆయన లెక్కలోకి రాబోరనే విషయం అర్థమవుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినవారు ఇప్పుడు తనను మనసావాచాకర్మణా నమ్మితే చాలు అనే ఉద్దేశంతో ఉన్నారు.

పార్టీని, తనను బలోపేతం చేసుకోవడానికి ఆయనకు ఉన్న మార్గం అదే. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినవారి చేరదీస్తే ఆయనకు రాజకీయంగా ఒరిగేదమీ ఉండదు. పైగా, ప్రశ్నలు వేస్తారు, సందేహాలు వ్యక్తం చేస్తారు. అవన్నీ ఆయన చెప్పే అభివృద్ధికి పనికి వచ్చేవి కావు. అందువల్ల కేసీఆర్ ను విమర్శించే కోణం మారాలేమో చూస్తే మంచిది.

- కె. నిశాంత్