అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన వివాదం వెనక్కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల వివాదం ముందుకు వచ్చింది. గత చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తలపెట్టిన అమరావతి రాజధానికి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎసరు పెట్టారు. వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను మార్చడానికి సిద్ధపడ్డారు.

అదే సమయంలో కర్నూలులో హైకోర్టును స్థాపించడానికి కూడా సిద్ధపడ్డారు. తీవ్రమైన వ్యతిరేకల మధ్య వైఎస్ జగన్ అడుగు కాస్తా వెనక్కి వేసినట్లు కనిపిస్తున్నారు. అమరావతిలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించకూడదనే విషయంపై దాదాపుగా ప్రతిపక్షాలన్నీ ఏకమైనట్లు కనిపిస్తున్నాయి.

Also Read: అమరావతిపై రోజుకొకలా మాట్లాడుతున్నారు: మంత్రులపై చంద్రబాబు ఫైర్

బిజెపి కూడా చాలా స్పష్టంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే కేంద్రం వైఖరి ఉన్నట్లు కనిపిస్తోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు అర్థమవుతోంది. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాటలను బట్టి, ఆయన చేపట్టిన మౌనదీక్షను బట్టి అది అర్థమవుతోంది. 

జగన్ ఒక రకంగా తేనెతుట్టెను కదిలించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన చిక్కులు కల్పించాలని భావిస్తే అది తనకే తలనొప్పిగా పరిణమించిన సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే, మూడు రాజధానుల విషయంలో ఆయన వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. నిర్ణయాన్ని వాయిదా వేసి తాత్కాలిక ఉపశమనం పొందాలని చూస్తున్నట్లున్నారు. అందుకే మంత్రి సమావేశంలో తన నిర్ణయానికి ఆయన ఆమోద ముద్ర వేయించుకోలేదు. దానిపై మరో కమిటీ వేయాలని నిర్ణయించుకున్నారు. 

Also Read: అమరావతిపై వివాదం: జగన్ కు ముందు నుయ్యి, వెనక గొయ్యి

ఇప్పుడు కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం అన్నట్లుగా ఆయన పరిస్థితి తయారైంది. హైకోర్టును కర్నూలులో స్థాపిస్తారని రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం రాజధానిగా మారుతుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశిస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనకు ఆ ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదురు కావచ్చు. 

మొత్తం మీద పరిస్థితి జగన్ ప్రస్తుతం అంత అనుకూల వాతావరణం ఉన్నట్లు కనిపించడం లేదు. పరిపాలన ఒక ప్రాంతం నుంచే జరగాలనేది తన నిశ్చితాభిప్రాయమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దాదాపుగా అన్ని పార్టీలు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యను జగన్ ఎలా పరిష్కరించుకుంటారనేది ఆయన వివేచన మీద ఆధారపడి ఉంటుంది.