తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికల తతంగం ముగిసింది. దాదాపుగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు చైర్మన్ల, మేయర్ల ఎన్నిక కూడా దాదాపుగా పూర్తయిపోయింది. ఇక ఇప్పుడప్పుడు రాష్ట్రంలో మరో భారీ స్థాయి రాష్ట్ర వ్యాప్త ఎన్నిక అయితే లేదు. జి హెచ్ ఎం సి ఎన్నికలున్నా అది కేవలం హైదరాబాద్ మహా నగరానికి వరకు మాత్రమే పరిమితం. 

ప్రతిసారి జరిగినట్టే తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నిక అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సారి కెసిఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి, గతంలో కెసిఆర్ మాట్లాడిన దానికి ఒక స్పష్టమైన తేడా కనపడింది. తెలంగాణాలో తెరాస తిరుగులేని విజయాన్ని సాధించింది. అందులో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

అయితే ప్రతిసారి ప్రెస్ మీట్లో కెసిఆర్ అంతా మాట్లాడిన తరువాత ఉమ్మడి పాలన వల్ల ఇంత నష్టపోయాము, అంత నష్టపోయాము అని గత పాలకులను తిట్టేవారు. గత పాలకులంటే... టీడీపీ ఎలాగూ కనుమరుగయిపోయినట్టే కాబట్టి టార్గెట్ చేసేది కాంగ్రెస్ నే!

Also read: ప్రపంచంలో భారతదేశ పరువు పోతుంది, అమిత్ షాకి చెప్పా: సిఏఏపై కేసీఆర్

కాకపోతే ఈ సారి అందుకు భిన్నంగా కెసిఆర్ బీజేపీపై విరుచుకుపడ్డారు. గతంలో ఎప్పుడు కూడా బీజేపీ గురించి మాట్లాడడం దండగ అన్నట్టుగా ప్రవర్తించే కెసిఆర్ ఈసారి మాత్రం బీజేపీపై తనదైన శైలిలో ఢిల్లీ నాయకుల నుండి గల్లీ నాయకుల వరకు ప్రతి ఒక్కరిపై విరుచుకుపడ్డారు. 

ఎందుకు కెసిఆర్ ఇలా ఎటాక్ చేసారు అనే ప్రశ్న సగటు మనిషి మనసులో ఉదయించడం తథ్యం. అందుకు కారణం తెలంగాణ మునిసిపల్ ఫలితాలు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ దాదాపుగా 240 వార్డులను కైవసం చేసుకుంది. కేవలం మునిసిపాలిటీలు కార్పొరేషన్లలో అక్కడో ఇక్కడో ఒక సీటు గెలవడం అన్నట్టుగా కాకుండా హైదరాబాద్ శివారులోని వాటిలో అత్యధికం కైవసం చేసుకుంది. 

ఆమనగల్, తుక్కుగూడ, మక్తల్ మునిసిపాలిటీలు కైవసం చేసుకోవడంతోపాటు నిజామాబాదు, మరో రెండు చోట్ల సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తెరాస, కాంగ్రెస్ ల తరువాత 3వ స్థానంలో బీజేపీ నిలిచినప్పటికీ.... అది పార్టీ పరంగా, రాష్ట్ర రాజకీయాలపరంగా చిన్న విషయం ఎంత మాత్రము కాదు. 

2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని కలిసి ఎన్నికలకు వెళితేనే బీజేపీ సాధించిన వార్డులు కేవలం 167, అదే 2020కి వచ్చే సరికి బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగి 240 వార్డులను కైవసం చేసుకోవడం పెద్ద విషయమే. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో కూడా బీజేపీ విస్తరిస్తుందనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. 

చాలా చోట్ల బీజేపీ తరుఫున నిలబడడానికి కనీసం అభ్యర్థులు కూడా లేరు. మొత్తం 3,052 వార్డులకు గాను ఎన్నికలు జరగ్గా... అందులో 700 పైచిలుకు సెగ్మెంటుల్లో బీజేపీ తరుఫున నిలబడడానికి అభ్యర్థులు కూడా కరువయ్యారు.

అంతే కాకుండా మొత్తం 120 మునిసిపాలిటీల్లో ఇప్పుడు 60 శాతానికి పైగా మునిసిపాలిటీల్లో కనీసం ఒక్క బీజేపీ అభ్యర్థి అయినా గెలిచి వారికి ఇప్పుడు ఆ మునిసిపాలిటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

హైదరాబాద్ శివారుల్లో గనుక తీసుకుంటే... మీర్పేట్ లో బీజేపీ 16 వార్డులను కైవసం చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. అలాగే బడంగ్పేట్ లో 10 సీట్లను గెలిచి అక్కడ కూడా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 

Also read: నేను గాయత్రీ మంత్రం చదువుతా, బిజెపి చెప్తేనేనా: కేసీఆర్

ఇలా బీజేపీ రాష్ట్రమంతటా విస్తరించడం తెరాస ను కలవరపెట్టింది, పెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెరాస తో పోల్చుకుంటే చాలా తక్కువ స్థానాలే కదా బీజేపీ గెలిచింది అక్కడక్కడా ఇలాంటివి సహజం అని అనిపించొచ్చు. కానీ బీజేపీ రాజకీయాలను, రాజకీయ యంత్రంగాన్ని తెరాస తట్టుకోలేదు. వారి రాజకీయాలు పూర్తిగా భిన్నమైనవి. ఇది కెసిఆర్ కు తెలియనిది కాదు. 

కరీంనగర్ లో హిందువులు, బొందువులు అని కెసిఆర్ ఏదో చెప్పబోతు అన్న ఒక్క డైలాగ్ ని బీజేపీ ఎలా వాడుకొని నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు గనుక హిందుత్వ కార్డును బలంగా ప్రయోగిస్తే...దాన్ని తట్టుకొని నిలబడడం అంత తేలికైన విషయం కాదు. 

దానితోపాటు తెలంగాణాలో మేమె ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ లోని అంతర్గత కలహాలు ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయి. అలా కాంగ్రెస్ గనుక రాను రాను మరింత బలహీనపడితే ప్రతిపక్ష స్థానాన్ని హైజాక్ చేయడానికి బీజేపీ కాచుకొని కూర్చుంది.

తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలినప్పుడు మాత్రమే తెరాస కు లాభం చేకూరుతుంది. 

ఒకవేళ మూడుముక్కలాటగా కాకుండా... బీజేపీ వర్సెస్ తెరాస గా గనుక పోరు సాగితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా బీజేపీ వైపుగా వచ్చేస్తుంది. కాంగ్రెస్ రోజు రోజుకు బలహీనపడుతున్న వేళ కెసిఆర్ దీన్ని గుర్తెరిగినట్టున్నారు. అందుకే ఆయన బీజేపీపై అంతలా రాజకీయ ఎదురుదాడికి దిగారు. 

బీజేపీ వల్ల ఇప్పటికిప్పుడు కెసిఆర్ కి వచ్చిన నష్టం అయితే లేదు. వారు చెబుతున్నట్టు 2023లో తామే ప్రత్యామ్నాయం అనే స్థితికి బీజేపీ ఇంకా చేరుకోలేదు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే... బీజేపీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు తమకు ఒకింత అనుకూలంగా మలుచుకున్నట్టు మనకు అర్థమవుతుంది.